హైదరాబాద్, వెలుగు: క్రూయిజ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కార్డేలియా క్రూయిజ్‌లు ఐదోసారి చెన్నై నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. 'కార్డేలియా ఎంప్రెస్' నౌక జూన్ 20వ తేదీన చెన్నై పోర్టుకు చేరుకోనుంది. ఆగస్టు చివరివరకు కొనసాగే ఈ సీజన్‌లో విశాఖపట్నం, పుదుచ్చేరి నగరాలతో పాటు శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలకు ప్రత్యేక సముద్ర యాత్రలు అందుబాటులో ఉంటాయి.
దీర్ఘకాల విహారయాత్రలు కోరుకునే వారి కోసం విశాఖపట్నం-–సింగపూర్ మార్గంలో 13 రాత్రుల ప్రత్యేక ప్యాకేజీని కూడా రూపొందించారు. ఈ నౌకలో ప్రయాణికుల కోసం సమగ్ర భోజన సదుపాయాలు, వినోద కార్యక్రమాలు, క్యాసినో, స్పా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
