మ్యుటేషన్లతో మరింత స్పీడ్‌గా వ్యాపిస్తున్న కొత్త వైరస్
లండన్‌లో 62% కేసులు ఈ వైరస్ తోనే
ఇప్పటికే 5 దేశాలకు పాకిన కొత్త కరోనా
నేటి నుంచి యూకే ఫ్లైట్లను బ్యాన్ చేసిన కేంద్రం
అలర్ట్ గానే ఉన్నం.. ప్యానిక్ కావొద్దు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
లండన్/న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కిందట.. డిసెంబర్ నెలలోనే కరోనా కలకలం షురువైంది. ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ.. ఏడాది తిరిగేసరికల్లా ఈ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసింది. ఏకంగా ఏడున్నర కోట్ల మందికి అంటుకున్నది. పదిహేడు లక్షల మంది ప్రాణాలను బలి తీస్కున్నది. దునియాను కనీవినీ ఎరుగని స్థాయిలో అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి ఈమధ్య ప్రభావం తగ్గినట్లు కనిపించింది. వ్యాక్సిన్లతో దీని ఖేల్ ఖతం అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు మళ్లా టెన్షన్ పుట్టిస్తున్నది. సరిగ్గా ఏడాదయ్యే సరికి.. రూపు మార్చేసింది. అప్పుడు చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పుడు బ్రిటన్ లో ‘కరోనా 2.0’గా విజృంభిస్తున్నది. మునుపటి కన్నా 70% స్పీడ్‌గా జనాలకు వ్యాపిస్తూ.. దునియాకు మళ్లా దడ పుట్టిస్తున్నది. దీంతో యూరప్ దేశాలు ఇప్పటికే బ్రిటన్ నుంచి ఫ్లైట్లు తమ ఎయిర్ పోర్టులకు రాకుండా బ్యాన్ చేశాయి.
మన దేశంలోకీ మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కొత్త రకం కరోనా నిజంగానే అంత డేంజరా? మునుపటి దాని కన్నా ఎక్కువగా ఇది ప్రాణాలను బలి తీస్కుంటుందా? ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్ లు, చేస్తున్న ట్రీట్ మెంట్లు పన్జేస్తయా? అంటే.. సైంటిస్టులు మాత్రం ఇప్పటికైతే ఏమీ చెప్పలేమనే అంటున్నరు.
31 వరకూ యూకే ఫ్లైట్లు రద్దు
బ్రిటన్ లో కొత్త రకం కరోనా నేపథ్యంలో ఆ దేశం నుంచి ఫ్లైట్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నెల 23 నుంచి 31 వరకూ యూకే నుంచి అన్ని రకాల ప్యాసింజర్ ఫ్లైట్లను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం కేంద్రం ప్రకటించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి11:59 గంటల తర్వాత యూకే నుంచి ఫ్లైట్లన్నీ రద్దు కానున్నాయి. 23న అర్ధరాత్రిలోపు బ్రిటన్ నుంచి వచ్చే ప్యాసెంజర్లందరికీ ఎయిర్ పోర్టుల వద్ద ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ కు పంపుతామని, మిగతా వాళ్లు ఇంటిదగ్గర ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. కొవిడ్ 19 జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ ప్రకటన చేసింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఫ్లైట్లను ఈ సస్పెన్షన్ పీరియడ్ లో దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపొద్దని అన్ని ఎయిర్ లైన్స్ ను డీజీసీఏ ఆదేశించింది. కార్గో ఫ్లైట్లకు ఆంక్షలు ఉండబోవని చెప్పింది.
దీని పేరు ‘వీయూఐ202012/01’
కొత్త రకం కరోనాకు ‘వీయూఐ202012/01’ అని సైంటిస్టులు పేరు పెట్టారు. దీని గురించి ఇంకా పూర్తిగా తెలియకపోవడంతో, దీనిని ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (వీయూఐ)’ అని పిలుస్తున్నారు. అయితే సెప్టెంబర్ 20న కెంట్, ఆ తర్వాత రోజున లండన్ లో ఈ కొత్త వైరస్ కు సంబంధించిన తొలి రెండు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ సెకండ్ వీక్ నాటికే.. దేశంలోని 60 ప్రాంతాల్లో 1000 కేసులు వచ్చాయి. వాస్తవంగా అప్పటికే ఈ కొత్త వైరస్ కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. నవంబర్ సెకండ్ వీక్ కల్లా లండన్ లో 28 శాతం కేసులు.. ఈ కొత్త కరోనావే ఉన్నాయని తేలింది. డిసెంబర్ 9 కల్లా లండన్ లో ఏకంగా 62 శాతం కేసులు దీనివే ఉన్నాయని వెల్లడైంది. ఇంగ్లాండ్ సౌత్ ఈస్ట్ ఏరియాలోనూ కొత్త కేసుల్లో మ్యుటెంట్ వైరసే కన్ఫామ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్కాట్లాండ్, వేల్స్ కంట్రీస్ కు కూడా కొత్త స్ట్రెయిన్ వ్యాపించిందని, నార్తర్న్ ఐల్యాండ్ కూ వైరస్ పాకి ఉండొచ్చని చెప్తున్నారు. డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీకి కూడా ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాపించినట్లు ఆయా దేశాలు వెల్లడించాయి.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
బ్రిటన్ లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. శనివారం ఉదయం నాటికి 3.50 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేసినట్లు హెల్త్ మినిస్టర్ మాట్ హాంకాక్ వెల్లడించారు. వీకెండ్ నాటికి 5 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపారు.
3 నెలల్లోనే16 లక్షల కేసులు!
బ్రిటన్ జనాభా దాదాపు ఆరున్నర కోట్లు. ఫస్ట్ కరోనా కేసు ఫిబ్రవరి నెలలో నమోదైంది. అయితే సెప్టెంబర్ 20 వరకూ.. ఏడు నెలల్లో మొత్తం కేసులు 4 లక్షల వరకూ నమోదయ్యాయి. కానీ డిసెంబర్ 21 నాటికి కేసుల సంఖ్య ఏకంగా 20 లక్షలు దాటిపోయింది. అంటే.. మూడు నెలల్లోనే ఏకంగా 16 లక్షల మందికి వైరస్ అంటుకుంది. అలాగే యూకేలో ఇప్పటిదాకా 67 వేలకు పైగా ప్రజలు కరోనాకు బలైపోయారు. గత కొద్ది రోజులుగా రోజూ 25 వేల నుంచి 35 వేల మధ్య కొత్త కేసులు వస్తుండగా.. రోజూ 400 నుంచి 600 మధ్య జనం బలైపోతున్నారు.
లండన్ షట్ డౌన్
కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకలు.. మామూలుగా అయితే ఈ టైంలో లండన్ సిటీ అంతా సందడిగా ఉంటది. కానీ మళ్లీ కరోనా కల్లోలం షురూ కావడం.. స్ట్రిక్ట్ లాక్ డౌన్ ప్రకటించడంతో ఆదివారం నుంచే లండన్ సిటీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది . అత్యవసర పనులుంటే తప్ప జనం బయటికి రావొద్దని, లాక్ డౌన్ రూల్స్ ను స్ట్రిక్టుగా పాటించాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరించింది . క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను రద్దు చేసింది. దీంతో షాపింగ్ మాల్స్, పార్కులు, రెస్టారెం ట్లు, సెలూన్లు, జిమ్ లు, నాన్ ఎసెన్షియల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడ చూసినా జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి.
అవుటాఫ్ కంట్రోల్
ఇప్పటివరకు ఉన్న కరోనా వైరస్ రకాల కన్నా ఈ కొత్త రకం వైరస్ అవుటాఫ్కంట్రోల్ గా వ్యాపిస్తోందని బ్రిటన్ హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. మ్యుటేషన్ ల కారణంగా ఇది ఇప్పటి కరోనా కన్నా 70 శాతం ఎక్కువ స్పీడ్ గా వ్యాపిస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తయితే తప్ప పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తోందని కొద్ది రోజుల క్రితమే పీఎం బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొత్త వైరస్ వల్ల హెల్త్ సమస్యలు తీవ్రం అవుతాయని గానీ, ఎక్కువ ప్రాణాంతకం అని గానీ లేదా వ్యాక్సిన్ లు పని చేయవని చెప్పేందుకు గానీ ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకూ యూకే నుంచి అన్ని రకాల ప్యాసింజర్ ఫ్లైట్లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆస్ట్రియా, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఫ్లైట్స్ రద్దు చేశాయి.
ముందు జాగ్రత్తగా మహారాష్ట్రలోని మున్సిపాల్టీల్లో ఈ నెల 22 నుంచి జనవరి 5 వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతానికి కొత్త రకం వైరస్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. వైరస్‌లోని స్పైక్స్తోపాటు ఇతర భాగాలనూ టార్గెట్ చేస్తాయంటున్నారు.
బ్రిటన్ నుంచి ఇటీవల వచ్చిన వారంతా వారం రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సూచించింది. ఈ వారం రోజుల్లో వచ్చిన వారి వివరాలు సేకరిస్తోంది.
31 వరకూ యూకే ఫ్లైట్లు రద్దు
బ్రిటన్ లో కొత్త రకం కరోనా నేపథ్యంలో ఆ దేశం నుంచి ఫ్లైట్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నెల 23 నుంచి 31 వరకూ యూకే నుంచి అన్ని రకాల ప్యాసింజర్ ఫ్లైట్లను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం కేంద్రం ప్రకటించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి11:59 గంటల తర్వాత యూకే నుంచి ఫ్లైట్లన్నీ రద్దు కానున్నాయి. 23న అర్ధరాత్రిలోపు బ్రిటన్ నుంచి వచ్చే ప్యాసెంజర్లందరికీ ఎయిర్ పోర్టుల వద్ద ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ కు పంపుతామని, మిగతా వాళ్లు ఇంటిదగ్గర ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. కొవిడ్ 19 జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ ప్రకటన చేసింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఫ్లైట్లను ఈ సస్పెన్షన్ పీరియడ్ లో దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపొద్దని అన్ని ఎయిర్ లైన్స్ ను డీజీసీఏ ఆదేశించింది. కార్గో ఫ్లైట్లకు ఆంక్షలు ఉండబోవని చెప్పింది.
ప్యానిక్ కావొద్దు: హర్ష వర్ధన్
కొత్త రకం కరోనాపై కేంద్ర ప్రభుత్వం పూర్తి అలర్ట్ గా ఉందని కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ చెప్పారు. దీనిపై ప్యానిక్ కావాల్సిన అవసరం లేదన్నారు. ఊహాగానాలు, చర్చలతో భయపడోద్దని కోరారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని, వైరస్ పై పోరాటాన్ని ఇకముందూ కొనసాగిస్తుందన్నారు. కొత్త స్ట్రెయిన్ కు అనేక జెనెటిక్ మార్పులు జరిగాయని, దీనిని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ వెల్లడించారు. మన దేశంలో రెండు నెలలుగా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త కరోనా వైరస్ వల్ల మళ్లీ తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు.
