క‌రోనా ఎఫెక్ట్: 25 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌ల్లంతు!.. 21 నెల‌లు క‌ష్టాలే..

క‌రోనా ఎఫెక్ట్: 25 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌ల్లంతు!.. 21 నెల‌లు క‌ష్టాలే..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ను చిన్నాభిన్నం చేసింది. ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు అన్ని ఎక్క‌డిక‌క్క‌డ మూత‌ప‌డ్డాయి. అన్ని ర‌కాల బిజినెస్ లు భారీగా న‌ష్ట‌ల‌పాల‌య్యాయి. ఈ ఎఫెక్ట్ ఆ కంపెనీల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌పై ప‌డింది. ఇప్ప‌టికే ప్ర‌పంచం ఆర్థిక మంద‌గ‌మ‌నంలో ఉండ‌గా.. కొత్త‌గా క‌రోనా ఎఫెక్ట్ తో నిరుద్యోగ స‌మ‌స్య మ‌రింత పెర‌గ‌బోతోంద‌ని ప‌లు సంస్థ‌ల స‌ర్వేలు చెబుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ఏడాది పాటు ఈ ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని, 2021 చివ‌రికి 25 ల‌క్ష‌ల మంది త‌మ ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. ముఖ్యంగా క‌రోనా వ‌ల్ల‌ అమెరికా ఎకాన‌మీపై కోలుకోలేని దెబ్బ‌ప‌డింద‌ని, ఈ క్రైసిస్ వ‌ల్ల ఆ దేశంలో 45 ల‌క్ష‌ల ఉద్యోగాలకు కోత ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఫ‌ర్ బిజినెస్ ఎక‌న‌మిక్స్ (ఎన్ఏబీఈ) సంస్థ పేర్కొంది. అందులో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు 2021 చివ‌రి క‌ల్లా మ‌ళ్లీ నిల‌బ‌డే ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని ఆ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో అంచ‌నా వేసింది. రానున్న 21 నెల‌ల‌పాటు అన్ ఎంప్లాయిమెంట్ రేట్ 6 శాతం దాటిపోయే చాన్స్ ఉంద‌ని తెలిపింది.

ఈ ఏడాది చివ‌రికి కొంత మెరుగుప‌డే చాన్స్

అమెరికా ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యంలో ఉంద‌ని స‌ర్వేలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆర్థికవేత్త‌లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు ఎన్ఏబీఈ ప్రెసిడెంట్ హంట‌ర్. క‌రోనాతో ఎక‌న‌మిక్ యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయిన నేప‌థ్యంలో ఈ ఏడాది తొలి అర్థ భాగంలో ముందుగా ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌కుండా చ‌ర్య‌లు కొన‌సాగుతాయ‌ని వారు అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారామె. అయితే ఉద్దీప‌న ప్యాకేజీల ద్వారా ఈ ఏడాది చివ‌రికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కొంత మెరుగుద‌ల ఉండొచ్చ‌న్నారు. చివ‌రికి ఏడాది మొత్తంగా 6 శాతం గ్రోత్ క‌నిపించే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే రోజులు గ‌డిచే కొద్దీ క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకునే చాన్స్ ఉండ‌డంతో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు న‌డిచే రెండో త్రైమాసికంలో ఎక‌న‌మిక్ యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోతుంద‌ని ఎన్ఏబీఈ చెబుతోంది. దీని వ‌ల్ల సెకండ్ క్వార్ట‌ర్ లో జీడీపీ 50 శాతం వ‌ర‌కు ప‌డిపోతుంద‌ని మ‌రో అంచ‌నాలో తెలిపింది ఈ సంస్థ‌.