భద్రాద్రి ఆలయ ఉద్యోగులకు కరోనా కష్టాలు

భద్రాద్రి ఆలయ ఉద్యోగులకు కరోనా కష్టాలు

వేతనాలు అందక దేవస్థానం ఉద్యోగుల ఇక్కట్లు

కమిషనర్‌‌ ఆమోదానికి నిరీక్షణ

భద్రాచలం, వెలుగుకరోనా కష్టాలు రామాలయం ఉద్యోగులనూ చుట్టుముట్టాయి. కోదండరాముడు కొలువుదీరిన ఆలయ సిబ్బంది అన్నమో రామచంద్రా..? అనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెగ్యులర్‌‌ ఉద్యోగులకు మూడు నెలలుగా, కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. కొవిడ్‌ రూల్స్‌తో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయడంతోపాటు, దర్శనాలపై ఆంక్షలు విధించారు. దీంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆలయ ఆదాయం పడిపోయింది. ప్రతిసారీ భక్తుల కానుకలతోనే సిబ్బందికి వేతనాలు ఇచ్చేది. ఆదాయం లేక సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు నిధుల కొరత ఏర్పడింది.

ఎఫ్‌డీలే దిక్కు

ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‍డీలు క్యాన్సిల్‌ చేయడం ద్వారా వచ్చే రూ.6 కోట్లతో వేతనాల సర్దుబాటు చేయొచ్చనే ప్రతిపాదనను దేవస్థానం ఈవో రమాదేవి ఎండోమెంట్‌ డిపార్ట్ మెంట్‌ ముందు పెట్టారు. ఈ ఫైల్‍పై సంబంధింత ఎండోమెంట్‌ మంత్రి ఆమోదముద్ర వేశారు. ఇక ఎండోమెంట్‌ కమిషనర్‌‌ ఆర్డరే తరువాయి. కానీ.. కమిషనర్‌‌ ఇంకా ఆర్డర్‌‌ ఇవ్వడంలేదు. వేతనాలు ఇవ్వలేక ఈవో ఇబ్బందులు పడుతున్నారు. పైనుంచి ఆర్డర్‌‌ రేపు మాపు అంటూ వాయిదాలు పెడుతుండడంతో ఉద్యోగుల్లో టెన్షన్‌ పోవడం లేదు.

చిరుద్యోగుల పరిస్థితి దయనీయం

దేవస్థానంలో పనిచేసే చిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. హౌస్‌ కీపింగ్‍ సిబ్బందికి దాదాపుగా 8 నెలల నుంచి వేతనాలు రావడం లేదు.
వీరు ఆలయంలో 62 మంది ఉన్నారు. మరో వంద మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. వీరికి కూడా ఆరు నెలలుగా జీతాలు లేవు. రెగ్యులర్‍గా పనిచేసే ఉద్యోగులు 89 మందికి నాలుగు నెలలుగా సాలరీస్‌ ఇవ్వడం లేదు. నెలకు కనీసం వేతనాలకే రూ.కోటి ఖర్చు అవుతుంది. కరోనా తొలినాళ్లలో లాక్‍డౌన్‌ కారణంగా భక్తులు రాలేదు. ఆలయం తలుపులు మూసేశారు. కేవలం స్వామికి అంతర్గత పూజలు మాత్రమే నిర్వహించారు. లాక్‍డౌన్‌ ఎత్తేశాక దర్శనాలకు అనుమతి ఇచ్చినా కరోనా భయంతో భక్తులు సరిగ్గా రావడం లేదు. తక్షణమే సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే కనీసం రూ.3 కోట్లకు పైగా నిధులు కావాలి. ముక్కోటి, శ్రీరామనవమి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు కూడా కొన్ని బిల్లులు చెల్లించాల్సి ఉంది. వారు కూడా దేవస్థానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎలాగైనా సరే బిల్లులు మంజూరు చేయాలంటూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ కష్టాలన్నింటి నుంచి గట్టెక్కాలంటే బ్యాంకుల్లో ఉన్న తమ రూ.6 కోట్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లను  రిలీజ్‌ చేయాలని ఈవో భావించారు. దీని కోసమే దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాశారు. దీనిపై సంబంధింత మంత్రి ఆమోదముద్ర వేయగా.. ఫైల్‌ తిరిగి ఎండోమెంట్‌ కమిషనర్‌‌ చాంబర్‍కు చేరింది. ఆయన ఆర్డర్‌‌ ఇస్తేనే డబ్బులు వస్తాయి. దీంతో రోజూ సిబ్బంది ఆర్డర్‌‌ కోసం ఆశతో
ఎదురుచూస్తున్నారు.

జీతాలు ఇచ్చేస్తాం

ఎఫ్‌డీలు ఉపసంహరించుకునే బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆమోదం జీవోగా విడుదలైతే వెంటనే ఎఫ్‌డీలు మార్చుకుని సిబ్బందికి వేతనాలు ఇచ్చేస్తాం. పెండింగ్‌ వేతనాలకు సంబంధించిన ఫైళ్లు మొత్తం సిద్ధం చేసి ఉంచాం. ప్రస్తుత కష్టకాలంలో సిబ్బందికి వేతనాలు చాలా అవసరం. అందుకే ప్రతిపాదనలను సమర్పించి త్వరగా అంగీకరించేలా ఉన్నతాధికారులతో మాట్లాడాం.– రమాదేవి, ఈవో, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం.