విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రైతులు గ‌త్త‌ర‌ప‌డొద్దు: మీ ఊరిలోనే ధాన్యం కొంటాం

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రైతులు గ‌త్త‌ర‌ప‌డొద్దు: మీ ఊరిలోనే ధాన్యం కొంటాం

క‌రోనా వైర‌స్ మ‌నంద‌రినీ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేసింద‌ని అన్నారు సీఎం కేసీఆర్. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు క‌ర్ఫ్యూలో ఉంద‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో రైతులెవ‌రూ త‌మ పంట‌లేమైపోతాయోన‌ని, వాటిని అమ్మ‌డం ఎలా అని భ‌య‌ప‌డొద్ద‌ని సూచించారు. అయితే ఎవ‌రూ గ‌త్త‌ర‌ప‌డితే ప‌ని జ‌ర‌గ‌ద‌ని, కాస్త ఆల‌స్య‌మైనా ప్ర‌తి రైతు పంట‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని అన్నారు. గురువారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారాయ‌న‌. ప్ర‌స్తుతం లాక్ డౌన్ ను ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా పాటిస్తే వైర‌స్ ను దేశం నుంచి త‌రిమేయొచ్చ‌ని అన్నారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు చివ‌రి ద‌శ‌లో చేతికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని, కొన్ని చోట్ల ఆఖ‌రి త‌డి అందిస్తే దిగుబ‌డి అందుతుంద‌ని అన్నారు. పంట నూర్పిడి జ‌రిగితేనే మ‌న‌కి ఆహారం వ‌స్తుంద‌ని, ఆ ప‌నుల‌కు ఆటంకం లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఒక్క ఎక‌రం కూడా ఎండిపోకూడ‌దు

రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆఖ‌రి త‌డికి నీళ్లు అందితే పంట చేతికొస్తుంద‌ని, అలాంటి వాళ్ల‌కోసం ఎస్పార్ఎస్పీ, సాగ‌ర్, జూరాల కింద నీళ్లు ఏప్రిల్ 10 వ‌ర‌కు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు సీఎం కేసీఆర్. ఎక్క‌డా ఒక్క ఎక‌రంలోనూ పంట ఎండ‌కుండా చూస్తామ‌న్నారు. బోర్ల‌పై ఆధార‌ప‌డి వేసిన వాళ్ల కోసం 24 గంట‌ల విద్యుత్ అందేలా ఆ శాఖ‌ను ఆదేశించామ‌ని చెప్పారు. పంట నూర్పిడి ప‌నుల‌కు ఎక్క‌డా ఆటంకం లేకుండా చూడాల‌ని అధికారుల‌కు సూచించామ‌ని, రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యులు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా రైతుల‌కు స‌హ‌కారం అందించాల‌ని అన్నారు.

మీరే హీరోలుగా మారాలి

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా నెలకొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రైతుల గ‌త్త‌ర‌ప‌డొద్ద‌ని, ప్ర‌భుత్వ‌మే ఆఖ‌రి గింజ వ‌ర‌కూ ఊర్ల‌కే వ‌చ్చి కొనుగోలు చేస్తుంద‌ని చెప్పారు. ఏప్రిల్ నెలంతా గ్రామాల‌కే వ‌చ్చి మార్కెంటింగ్ సిబ్బంది, వ్య‌వ‌సాయ శాఖ సిబ్బంది, క‌లెక్ట‌ర్లు పంట కొనే ప‌ని మీదే ఉంటారని అన్నారు సీఎం. రైతులు ఆగం కావాల్సిన ప‌ని లేద‌ని, బ్యాంకు అకౌంట్ నంబ‌రు చెబితే దానిలోనే పంట అమ్మిన డ‌బ్బులు ప‌డ‌తాయ‌ని, అయితే ఒక నెల ఆల‌స్యం కావొచ్చ‌ని చెప్పారు. రైతు బంధు స‌మితి స‌భ్యులు రైతుల మ‌ధ్య‌నే ఉండాల‌ని, ఊరికి క‌థానాయ‌కులు (హీరోలు)గా మారి.. రైతుల పంట‌ల అమ్మ‌కం, వాళ్ల‌కు డ‌బ్బులు వ‌చ్చేలా చూడడం వంటి ప‌నుల్లో అండ‌గా ఉండాల‌ని సూచించారు సీఎం కేసీఆర్. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తే వ్యాపారులు కూడా రైతుల వ‌ద్ద పంట‌ కొన‌వ‌చ్చని చెప్పారాయ‌న‌.