చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..

పీపీఈ కిట్ లేకుండా డెడ్‍బాడీ అప్పగింత
కుండపట్టిన కొడుకుకు టెస్టుల్లో పాజిటివ్‍
రిపోర్టులో ఎంజీఎం ఆఫీసర్ల నిర్లక్ష్యం

వరంగల్‍ రూరల్‍, వెలుగు: వరంగల్‍ ఎంజీఎం కోవిడ్‍ బాధ్యతలు చూస్తున్న అధికారుల అలసత్వం వందలాది మందిని టెన్షన్‍ పెడుతోంది. దేశాయిపేటకు చెందిన మహిళ(52) ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‍లోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‍మెంట్‍ తీసుకుంది. ఇంటికి తిరిగొచ్చాక కొన్ని రోజులకు ఆమెతోపాటు కొడుకుకు(27) కరోనా లక్షణాలు కనిపించడంతో ఎంజీఎం వెళ్లారు. నాలుగైదు రోజులుగా చికిత్స పొందుతున్న క్రమంలో గురువారం మహిళ మృతిచెందింది. ఆమె డెడ్‍బాడీని పీపీఈ కిట్‍లో చుట్టి ఇవ్వడానికితోడు అంత్యక్రియల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంజీఎం అధికారులు పట్టించుకోలేదు. కోవిడ్‍ నెగెటివ్‍గా చూపి బంధువులకు మృతదేహాన్ని మామూలుగా అప్పజెప్పారు. డాక్టర్లే స్వయంగా కరోనా నెగెటివ్‍ అనడంతో బంధువులు పెద్దఎత్తున వచ్చి మృతదేహం మీదపడి రోదించారు. అతని కొడుకుని దగ్గర తీసుకుని కన్నీరు కార్చారు. సంప్రదాయం ప్రకారం పెద్దలు కట్టె వేసే మొదలు కుండ పట్టే వరకు దగ్గరుండి చేయించారు.

పాజిటివ్ అనడంతో బంధువుల్లో టెన్షన్
శుక్రవారం ఉదయం ఎంజీఎం అధికారులు ఎంజీఎం కోవిడ్‍ వార్డు నుంచి బాధిత మహిళ కొడుకుకు ఫోన్‍ చేశారు. ముందురోజు చనిపోయిన అతని తల్లికి కరోనా పాజిటివ్‍ అని చెప్పారు. అతన్ని ఎంజీఎం రావాలని సూచించారు. టెస్టులో యువకుడికి సైతం పాజిటివ్‍ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో అంత్యక్రియల్లో చాలా దగ్గరగా పాల్గొన్న వందలాది మంది ఎంజీఎం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మృతుల రిపోర్టును నెగెటివ్‍ ఇవ్వడానికితోడు డెడ్‍బాడీ ఇచ్చే టైంలో రూల్స్ పాటించకపోవడంపై మండిపడుతున్నారు. వారి తప్పిదంవల్లే తాము అంత్యక్రియల్లో అలా పాల్గొన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు వెళ్లొచ్చినవారంతా ఇప్పుడు కరోనా భయాందోళనలో ఉన్నారు.

For More News..

పెద్దపల్లి మహిళకు కరీంనగర్ లో అంత్యక్రియలు

ఫోన్లు ట్యాప్ చేసుడేంది?

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే