
- నెగెటివ్ రిపోర్టుంటేనే అసెంబ్లీలోకి
- కరోనా రూల్స్ ప్రకారమే సమావేశాలు: స్పీకర్ పోచారం
హైదరాబాద్, వెలుగు: కరోనా రూల్స్ ప్రకారమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ, కౌన్సిల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, లా అండ్ ఆర్డర్, కరోనా నివారణ చర్యలపై శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మార్షల్స్, బందోబస్తు డ్యూటీలో ఉండే పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో రోజూ రెండు సార్లు శానిటైజేషన్ చేయిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లతోనే హాజరుకావాలన్నారు.