యూత్​ను వదిలిపెట్టని కరోనా

యూత్​ను వదిలిపెట్టని కరోనా
  • వారి ద్వారా ఇంట్లో వాళ్లకు వైరస్​
  • మాస్కులు పెట్టుకోకపోవడం, రూల్స్​ పాటించకపోవడంతోనే ముప్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు యూత్​లోనూ ఎక్కువగా వస్తున్నాయి. అన్​లాక్​ అమలులోకి వచ్చినప్పటి నుంచి తమకేమీ కాదనే నిర్లక్ష్యంతో గైడ్​లైన్స్​ను పాటించకపోవడంతో వారిపై వైరస్​ ఎటాక్​ చేస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగడం, గంటల కొద్దీ గుమిగూడి ముచ్చట్లు పెట్టడం, మాస్కులు పెట్టుకోకపోవడం, శానిటైజర్లు వాడకపోవడం వంటి కారణాలతో కరోనా కోరలకు యూత్​ చిక్కుకుంటున్నారు. వారి వల్ల ఇంట్లో వాళ్లకు కూడా వైరస్​ సోకుతోంది. సర్కారు లెక్కల ప్రకారం మొత్తం కరోనా కేసుల్లో 21‌‌-–30 ఏండ్ల ఏజ్​ గ్రూప్​ వాళ్లే  23.66 శాతం మంది ఉంటున్నారు. 31–-40 ఏండ్ల ఏజ్​ గ్రూప్ వాళ్లు  23.04 శాతం మంది ఉన్నారు. గతంలో 60 ఏండ్లు పైబడిన వాళ్లకే కరోనా ప్రమాదకరంగా మారుతుందని, వాళ్లకే తొందరగా వైరస్​ సోకుతుందని భావించే వాళ్లు. కానీ ఇప్పుడు యూత్​పై  కూడా అది తీవ్ర ప్రభావం చూపుతోంది.రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 412 కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్​ఎంసీ పరిధిలో 103 మందికి పాజిటివ్​ వచ్చింది. మంగళవారం జగిత్యాల జిల్లాలో 73, నిర్మల్​ జిల్లాలో 60, ఆదిలాబాద్​ జిల్లాలో 33 కేసులు వచ్చాయి. టిమ్స్​లో నాలుగు రోజుల క్రితం 80 కేసులుంటే మంగళవారం నాటికి ఆ సంఖ్య 150కి చేరిందని హాస్పిటల్​ సూపరింటెండెంట్​ విమల థామస్​ చెప్పారు. కేసులు పెరుగుతుండటంతో అన్ని హాస్పిటళ్లలో కావాల్సిన ఏర్పాట్లు చేశామని హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాస రావు అన్నారు.  
దగ్గు, సర్ది, జ్వరం ఉంటే కరోనా టెస్ట్​ కంపల్సరీ
ఎండలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణం మారింది. జనం జలుబు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్​తో బాధపడుతున్నారు. ముక్కు కారడం, గొంతు పూడుకుపోవడం సాధారణ లక్షణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది తమకున్నవి సాధారణ ఫ్లూ లక్షణాలే అనుకొని సొంత వైద్యం చేసుకుంటున్నారు. అయితే.. డాక్టర్లు మాత్రం ఈ లక్షణాలతో ఎవరైనా హాస్పిటల్​కు వస్తే వారికి తప్పకుండా కరోనా టెస్టులు రాస్తున్నారు. టెస్టులు చేసుకుంటే చాలా మందికి పాజిటివ్​ అని వస్తోంది. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, లక్షణాలు ఉంటే తప్పనిసరిగా  కరోనా  టెస్టు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 
నిర్లక్ష్యమే ప్రమాదం
కొవిడ్​ ట్రీట్​మెంట్​ చాలా అడ్వాన్స్​ కావడం, వ్యాక్సిన్​ కూడా వచ్చేయడం, తీవ్రత అంతగా కనిపించకపోవడంతో జనం రిలాక్సయ్యారు. అన్​లాక్​తో ఫ్రీగా తిరుగుతున్నారు. విధిగా మాస్కు పెట్టుకోవాలని, సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించాలని రూల్స్​ చెబుతున్నా ఎవరూ పాటించడం లేదు. ముఖ్యంగా యువత ఈ గైడ్​లైన్స్​ను ఖాతరు చేయడం లేదు. గుంపులుగా తిరగడం, గంటలు గంటలు గుమిగూడి ముచ్చట్లు పెట్టుకోవడం, ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో యూత్​ను కరోనా అటాక్​ చేస్తోందని, వారి వల్ల కుటుంబంలోని వాళ్లకు కూడా సోకుతోందని డాక్టర్లు అంటున్నారు. 
పరిస్థితి సీరియస్
కరోనా సోకితే తమకేం కాదని, పెద్దవాళ్లకే సమస్య అనే భావనలో యువత ఉంటున్నారు. కానీ యువతలోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొందరి విషయంలో ప్రాణాంతకంగా కూడా తయారవుతోంది. గాంధీ హాస్పిటల్​లో ప్రస్తుతం 79 మంది ఐసీయూలో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. ఇందులో పది శాతం మంది 45‌‌‌‌ ఏండ్ల వయసువాళ్లు ఉన్నారని, గతంలో 60 ఏండ్లు పైబడిన వాళ్లే ఐసీయూలోకి వచ్చే వారని గాంధీ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ రాజారావు చెప్పారు. 
రూల్స్​తోనే కరోనాకు కటీఫ్​
బయటకు వెళ్లినప్పుడు మాస్క్​ పెట్టుకోవాల్సిందేనని సీసీఎంబీ డైరెక్టర్​ రాకేశ్​ మిశ్రా అన్నారు. కొవిడ్​ గైడ్​లైన్స్​ పాటించకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని డాక్టర్ రాజారావు అన్నారు. మాస్కులు పెట్టుకోవడం, డిస్టెన్స్​పాటించడం,  శానిటైజర్లు వాడటం మరువొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.  

45 ఏండ్ల వాళ్లకూ సీరియస్​
గాంధీ హాస్పిటల్​ కొవిడ్  నోడల్​ సెంటర్​ కాబట్టి క్రిటికల్  పేషెంట్లను మాత్రమే అడ్మిట్​ చేసుకుంటున్నం. మైల్డ్​ సింప్టమ్స్​ ఉంటే కింగ్​కోఠి, టిమ్స్​కు పంపుతున్నం. ఇక్కడికి వచ్చే వాళ్లలో బీపీ, షుగర్​ ఉన్న 60 ఏండ్ల పైబడిన వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు 45 ఏండ్ల వాళ్లు కూడా సీరియస్​ కండిషన్స్​తో అడ్మిట్​ అవుతున్నరు. -డాక్టర్​ ఎం.రాజారావు, గాంధీ హాస్పిటల్​ సూపరింటెండెంట్

అన్నీ సిద్ధంగా ఉన్నయ్‌
4 రోజుల కింద టిమ్స్​లో 80 మంది పేషెంట్లుంటే ఇప్పుడు 150 మంది అయ్యారు. ఐసీయూలో 15 మంది ఉన్నరు. కరోనా ఓపీ కూడా పెరిగింది. కేసులు పెరుగుతున్నాయని అవసరమైన మెడిసిన్స్​ తెప్పించినం. ఆక్సిజన్​, బెడ్స్​, స్కానింగ్​ మెషిన్లు సిద్ధం చేసినం. మోడరేట్​ సింప్టమ్స్​, కోమార్బిడిటీ ఉన్న వాళ్లు టిమ్స్​లో వచ్చి చేరవచ్చు. - విమలా థామస్, టిమ్స్ డైరెక్టర్