భారత్​ జోడో యాత్రను ఆపేందుకే కరోనా రూల్స్​ : రాహుల్ గాంధీ

భారత్​ జోడో యాత్రను ఆపేందుకే కరోనా రూల్స్​ :  రాహుల్ గాంధీ

కేంద్రంపై రాహుల్ ఫైర్ 

నూహ్ (హర్యానా): భారత్ జోడో యాత్రను ఆపేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా సాకులు చెబుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనా రూల్స్ పాటించలేకపోతే యాత్రను ఆపాలంటూ కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ లెటర్ రాయడంపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రస్తుతం హర్యానాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్.. గురువారం నూహ్ జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ యాత్ర కాశ్మీర్ వరకు జరుగుతుంది. దీన్ని ఆపాలని వాళ్లు (కేంద్రం) కొత్త ఐడియాతో వచ్చారు. కరోనా వ్యాప్తి చెందుతోందని, రూల్స్ పాటించాలని.. లేదంటే యాత్రను ఆపాలని లెటర్ రాశారు. 

నా యాత్రను ఆపేందుకు ఇవన్నీ వాళ్లు చెబుతున్న సాకులు మాత్రమే” అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఫైర్ అయ్యారు. అందుకే ప్రజలకు మా వాయిస్ వినిపించేందుకు యాత్ర చేపట్టాం” అని తెలిపారు. ‘‘ఈ యాత్రలో పాల్గొన్న ఎవరూ ఎవరినీ.. కులం, మతం, భాష, ప్రాంతం ఏంటి? అని అడగలేదు. ఒకనొకరు గౌరవించుకున్నారు. ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఇండియా కావాలి. రైతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను ఆదుకోవాలి. అలాంటి దేశాన్నే అందరూ కోరుకుంటారు. ఆర్ఎస్ఎస్, మోడీ నింపిన ద్వేషంతో ఉన్న దేశాన్ని ఎవరూ కోరుకోరు” అని రాహుల్ గాంధీ అన్నారు.