ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా టెన్షన్

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా టెన్షన్

మార్చి 14 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతికి కరోనా లక్షణాలున్నట్లు తేలింది. గత నెల 23న మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. లండన్ నుంచి వచ్చిన మరో యువకుడిని కరోనా పాజిటివ్ రాగా, అతడి కారణంగా తన తండ్రికి, వారి ఇంట్లో పని మనిషికి కరోనా సోకింది. లాక్ డౌన్ కు ముందే అక్కడ నలుగురికి పాజిటివ్ అని తేలగా, అక్కడ ఆఫీసర్లు తీసుకున్న చర్యలతో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. గాంధీ హాస్పిటల్లో చేరిచికిత్స పొందిన నలుగురిలో గురువారం వరకు ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు . రెండు వారాలకు పైగా రోజుల నుంచి కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఉన్న నాలుగు కేసుల్లో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు . మరొకరు కూడా ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల్లో కొంత టెన్షన్ తగ్గింది. కొత్తగా బయటి నుంచి వచ్చే వారు లేకుండా, కరోనా సోక కుండా తగిన చర్యలు తీసుకుంటే చాలన్న అభిప్రాయంతో ఆఫీసర్లున్నారు . ఇక ఖమ్మం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో కరోనా ప్రవేశించిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు ఖమ్మం జిల్లాలో కరోనా కేసు లేమీ రాలేదు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని ఈనెల 6న తేలగా, రెండ్రోజుల్లోనే మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఖమ్మం జనాల్లో ఆందోళన పెరిగింది. ఆఫీసర్లు ఎంత చెబుతున్నా వినకుండా చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వచ్చిన వారిలో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తోంది. ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో జనం ఇండ్లకు పరిమితమవుతున్నారు . పోలీసులు, ఆఫీసర్లు ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తుండడంతో జనం స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు . అయితే మొదట పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన వారితో పాటు, రెండో కేసుకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ కు చెందిన రిపోర్టులు రాకపోవడం, ఢిల్లీ మర్కజ్ వెళ్ళి వచ్చిన వారికి మొదటిసారి నెగిటివ్ రాగా , రెండోసారి పంపిన శాంపిల్స్ ఫలితాలు రాకపోవడంతో పరిస్థితి ఎలాఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పాజిటివ్ కేసుల ద్వారా ఎవరికైనా వ్యాప్తిచెందిందా? లేదా? అనే విషయంలో టెన్షన్ నెలకొంది. గురువారం డీఎంహెచ్వో చెబుతున్న ప్రకారం ఇంకా 66 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. శాంపిల్స్ పంపిన నాలుగైదు రోజుల తర్వాత రిపోర్టులు వస్తుండడంతో అప్పటి వరకు ఇతరుల్లో నూ ఆందోళన పెరుగుతోంది.

 

  కరోనా కేసుల వివరాలు                                      ఖమ్మం           భద్రాద్రి కొత్తగూడెం

 

ఏప్రిల్ 9 వరకు పరీక్షలకు పంపిన శాంపిల్స్       205               61

కరోనా నెగిటివ్ వచ్చినవి                                      137               57

కరోనా పాజిటివ్ వచ్చినవి                                        02               04

కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్అయినవారు            00              03

కరోనాతో ఇప్పటి వరకు చనిపోయిన వారు               00              00

ఇంకా రిపోర్టులు రావాల్సినవి                                  66              00

ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు        580            241

హోం క్వారంటైన్లో ఉన్న వారు                            564               86

స్పెషల్ క్వారంటైన్ లో ఉన్న వారు                      18               48