
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి 12 నుంచి 14 ఏండ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్), డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ వయసు గ్రూపులో 17.23 లక్షల మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో వీళ్లకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌లో ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, లేదా నేరుగా సెంటర్‌కు వచ్చినా వ్యాక్సిన్ వేస్తామన్నారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్–ఈ సంస్థ రూపొందించిన కొర్బెవాక్స్ వ్యాక్సిన్‌ను వీరికి ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మంత్రి హరీశ్‌రావు బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.