కరోనా వైరస్ బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్ బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు

ఇటీవల చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతోంది ప్రాణాంతక కరోనా వైరస్. సోమవారం నాటి చైనాలో 2744 మందికి ఈ వైరస్ సోకింది. వారిలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తల నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని బారిన పడినవారికి వైరస్ సింప్టమ్స్‌కి మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. కొన్ని సూచనలను పాటించాలని చెబుతూ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.

డబ్ల్యూహెచ్‌వో సూచనలివే

  • రోజులో అప్పుడప్పుడూ చేతులను సబ్బు లేదా అల్కహాల్ బేస్డ్ జెల్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
  • తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డంపెట్టుకోవాలి. ఆ వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ఎవరైనా జ్వరం, తీవ్రమైన జలుబు, శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండండి.
  • మీకు జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే జాగు చేయకుండా వైద్యుల్ని కలవండి.
  • ఇప్పటికే కరోనా సోకిన ప్రాంతాల్లో జంతువులను పొరబాటున కూడా తాకవద్దు.
  • మాంసం, గుడ్లు తినేటప్పుడు బాగా ఉడికించాలి. పాలు కూడా ఎక్కువగా వేడి చేశాకే తాగాలి.

హైదరాబాద్‌లో కరోనా అనుమానిత కేసులు

చైనా నుంచి ఈ వైరస్ ఇతర దేశాలకు ఇప్పటికే వ్యాపించింది. అమెరికా, థాయ్‌లాండ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, సింగపూర్, మలేసియా, ఫ్రాన్స్, వియత్నాం వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా నుంచి భారత్‌లోకి వచ్చేవారిని స్ర్కీనింగ్ చేసి ఎయిర్‌పోర్టుల నుంచి బయటకు పంపుతున్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులేమీ లేనప్పటికీ హైదరాబాద్, ముంబైలలో కరోనా సోకినట్లు అనుమానిస్తున్న కొందరిని స్పెషల్ వార్డుల్లో పెట్టి పరీక్షిస్తున్నారు.