లాక్​డౌన్​ పొడిగిస్తే 4 కోట్ల మొబైల్స్ మటాష్

లాక్​డౌన్​ పొడిగిస్తే 4 కోట్ల మొబైల్స్ మటాష్
  • మే నెలాఖరుదాకా కొనసాగితే అంతే సంగతులు: ఐసీఈఏ

హైదరాబాద్: కరోనా ఎఫెక్టుతో అమల్లో ఉన్న లాక్​డౌన్ కొనసాగితే నాలుగు కోట్లు మంది చేతుల్లో మొబైల్ ఫోన్స్ లేకుండా పోతాయట. ఫోన్లు కింద పడి డిస్ల్పే పగిలిపోవడం, డ్యామేజీ, హ్యండ్ సెట్లలో వచ్చే లోపాల వల్ల చాలాఫోన్లు ఉపయోగంలో లేకుండా పోతాయని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) చెప్తోంది. కరోనా ఎఫెక్ట్, లాక్​డౌన్ తో అన్ని రంగాలు మూతపడ్డాయి. దీంతో ఫోన్ల విడిభాగాల ట్రాన్స్ పోర్టు, హ్యాండ్ సెట్స్ అమ్మకాలు, మొబైల్ రిపేరు షాపులు కూడా బంద్ అయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే మే నెలాఖరు దాకా కొనసాగితే దాదాపు నాలుగు కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు వినియోగంలో లేకుండా పోతాయని ఐసీఈఏ అంచనా వేసింది.

నెలకు 2.5 కోట్ల అమ్ముడయ్యేవి
‘‘దేశవ్యాప్తంగా ఇప్పటికి 85 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ప్రతి నెలా సగటున 2.5 కోట్ల కొత్త ఫోన్లు అమ్ముడవుతాయి. ఇందులో 25 శాతం ఫోన్లు రిపేర్లు, సర్వీసుల కోసం వస్తుంటాయి. లాక్​డౌన్ కారణంగా గడిచిన నెలలో ఎవరూ ఫోన్లు బాగు చేయించుకోలేదు. కొత్త ఫోన్లు కూడా కొనలేదు. దీంతో 2.5 కోట్ల మొబైల్ ఫోన్లు లోపాలు, బ్రేక్ డౌన్లతో నిరుపయోగంగా మారి ఉండవచ్చు. లాక్​డౌన్ ఇట్లనే మే నెల ఎండింగ్ వరకు కంటిన్యూ అయితే మాత్రం ఆ సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుంటుంది” అని ఐసీఈఏ వెల్లడించింది. కొన్ని రంగాలకు ట్రాన్స్ పోర్టు వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కల్పించిందని .. ఆ లిస్టులో మొబైల్ ఫోన్లను కూడా చేర్చాలని కొన్ని కంపెనీలు కోరుతున్నాయి.