- డీమార్ట్, సూపర్ మార్కెట్‌లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి
- రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి
- పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
- అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తం
- 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధం
- రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను ఇండ్లనుంచి వెళ్లగొడ్తున్నరని కామెంట్
- 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటేరియెట్ నుంచి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన
- మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని
- రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటన
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి
- మహిళా సంఘాల కోసం చిలుక పచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ దిగ్గజాలైన డీమార్ట్, హెరిటేజ్‌లాంటి చైన్ సూపర్ బజార్‌లకు పోటీగా రాష్ట్రంలో ‘మహిళా శక్తి సూపర్ బజార్‌లను’ స్థాపించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ అందిస్తామని, పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ స్థలాలను నామినల్ రెంట్‌పై 30 ఏండ్ల దీర్ఘకాలిక లీజుకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
దళారులు, మిల్లర్ల దోపిడీకి చెక్ పెడుతూ మహిళలే స్వయంగా రైస్ మిల్లులు, పెద్ద పెద్ద గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే 20 నుంచి 100 ఎకరాల వరకు భూములను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. సోమవారం సెక్రటేరియెట్ నుంచి వర్చువల్ విధానంలో ఒకే రోజు, ఒకే సమయంలో 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సోలార్ ప్లాంట్లకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి తక్షణమే రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం, ఈసారి మహిళల కోసం ‘చిలక పచ్చ’ రంగు ఇందిరమ్మ చీరల నూతన డిజైన్లను ఆవిష్కరించారు. గతంలో ఉత్పత్తి పూర్తికాక వాయిదాపడ్డ పట్టణ ప్రాంతాల మహిళలకు సైతం త్వరలోనే వీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మధ్య రాజకీయాల్లో ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను ఇండ్లనుంచి వెళ్లగొడుతున్న అన్నలను చూస్తున్నామని.. కానీ, తమ మంత్రివర్గం మాత్రం కోటి మంది మహిళలను సొంత సోదరీమణుల్లా భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆడబిడ్డల ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికి తిరుగుండదని, 2034 లోపల కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
తొలివిడతగా 553 బస్సులను ప్రారంభిస్తం
రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, దేశంలోనే వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు. మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందని, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం కూడా పురోగమిస్తుందని పేర్కొన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు.
గత 29 నెలల కాలంలో ఉచిత ప్రయాణానికి సంబంధించి రవాణా సంస్థకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా నిధులను చెల్లించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అభినందించారు. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ కొందరు గిట్టనివాళ్లు ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను రెచ్చగొట్టి కుట్రలు పన్నారని, అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మహిళా పక్షపాత నిర్ణయానికే కట్టుబడి ఉందన్నారు. కేవలం ఉచిత ప్రయాణానికే పరిమితం కాకుండా, మహిళలను బస్సులకు యజమానులను చేయాలనే సంకల్పంతో వెయ్యి బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
మహిళా సంఘాల ద్వారా నడిచే ఈ బస్సుల ద్వారా నెలకు రూ.70 వేల అద్దె వచ్చేలా ఏర్పాట్లు చేశామని, తొలి విడతగా 553 బస్సులను త్వరలోనే పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రారంభిస్తామన్నారు. అన్ని మండలాల నుంచి మహిళలు పరేడ్ గ్రౌండ్‌కు తరలివచ్చి ఐదో తారీఖు సాయంత్రం ఒకే కుటుంబంలా బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకునేలా ప్లాన్ చేశామని సీఎం వివరించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే చేసే పెట్రోల్ బంకుల వ్యాపారంలోకి సైతం మహిళలను భాగస్వాములను చేశామని, ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంకులు నడుపుతూ మహిళలు నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మరిన్ని స్థలాలు కేటాయించి ఈ వ్యాపారాన్ని విస్తరింపజేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ ద్వారా ఈ నెల 29న ప్రత్యేకంగా ‘ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్’ను ప్రారంభించి బ్యాంకు రుణాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మహిళలకు రికార్డు స్థాయిలో రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాల (జీరో వడ్డీ) కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,397 కోట్లు బ్యాంకులకు చెల్లించిందని వివరించారు.
కార్పస్ ఫండ్ ఇస్తం
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డీమార్ట్, బిగ్ బజార్‌లాంటి కార్పొరేట్ చైన్ సూపర్ బజార్‌లకు పోటీగా రాష్ట్రంలో ‘మహిళా శక్తి సూపర్ బజార్‌లను’ స్థాపించబోతున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులే ఒక పెద్ద సైన్యమని, వీరంతా కొనుగోలుదారులైతే ఏ సూపర్ బజారైనా దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని విశ్లేషించారు.
ఈ సూపర్ బజార్‌ల ఏర్పాటుకు ప్రభు త్వం తరఫున కార్పస్ ఫండ్ ఇస్తామని.. యెన్నం శ్రీని వాస్ రెడ్డి ఇచ్చిన ఈ అద్భుతమైన సలహా తనకు బాగా నచ్చిందన్నారు. మహిళలు కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టి షేర్ హోల్డర్లుగా భాగస్వాములు కావాలని, అప్పుడు వందల వేల కోట్ల వ్యాపారం మనవాళ్లే చేసుకోవచ్చన్నారు.
మహిళలే రైస్ మిల్లులు పెట్టుకోవాలి
పెద్ద పెద్ద కంపెనీల యజమానులు బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పులు తెచ్చి, దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోతుంటే, మన మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని సకాలంలో చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రవాణా, ఐకేపీ మిల్లుల సమస్యలు, దళారుల వేధింపులు ఎదురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారంగా మహిళలే స్వయంగా రైస్ మిల్లులు పెట్టుకోవాలని సూచించారు. అమెజాన్‌లాంటి అంతర్జాతీయ సంస్థల తరహాలో మహిళా సంఘాలు పెద్ద పెద్ద గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకుంటే మండల కేంద్రాల్లో 20 నుంచి 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించే బాధ్యత తనదేనని చెప్పారు.
దళారులు, మిల్లర్లు ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని, అదే బాధ్యత మహిళలకు అప్పగిస్తే ప్రతి గింజకూ జవాబుదారీతనంగా ఉంటారన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 4 ప్రాంతాలను గుర్తించి, ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని, వీటికి జీరో వడ్డీతో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు.
మహిళా సంఘాలతో సీఎం ముఖాముఖి
ఒక్క రూపాయి ఎన్‌పీఏ లేదు: గతంలో పైసలు లేక సంఘాలు నడపలేక ఇబ్బంది పడ్డాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక సంఘాలు చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. మంత్రి సీతక్క మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. జిల్లాలో 15 ఏండ్ల నుంచి కట్టని 74 సంఘాల మొండి బకాయిలు ఉండేవి.
మా పీడీ, స్టాఫ్ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా వాళ్లకు పనులు కల్పించి, వేతనాలు వచ్చేలా చేయడంతో ఆ పైసలతో బ్యాంకు లోన్లు కట్టేశారు. ఇప్పుడు మాకు ఒక్క రూపాయి కూడా నాన్ ఫెర్మార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ) లేదు. మాకు రూ. 42 కోట్ల పావలా వడ్డీ పైసలు, పాడి పరిశ్రమ కింద రూ. 40 కోట్లు వచ్చాయి. మా నిర్మల్ జిల్లాకు 4 సార్లు అవార్డు వచ్చింది. జిల్లాలో మొత్తం 18 మండలాలు, 12 వేల సంఘాలు, 1,34,000 మంది సభ్యులు ఉన్నారు.
గంగమణి, నిర్మల్ జిల్లా సమాఖ్య ప్రతినిధి
సీఎం: కలెక్టర్.. మెయిన్ రోడ్డులో ఎక్కడైనా ప్రైమ్ ప్రాపర్టీ ఉంటే చూడండి. ఇంత మంచిగా బ్యాంకుల్లో ఒక్క పైసా పెండింగ్ లేకుండా లోన్లు కట్టినందుకు వీళ్లకు ఒక మంచి రివార్డ్ ఇవ్వాలి. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ లేదా పంచాయతీరాజ్ శాఖల పరిధిలో ఎక్కడైనా స్థలం ఉంటే, దాన్ని వెంటనే వెతికి వాళ్లకు పెట్రోల్ బంక్ స్థలం ఇవ్వు. వచ్చేవాళ్లకు, పోయేవాళ్లకు అందరికీ ఇది ఆదర్శ సంఘంగా నిలవాలి. (సెర్ప్ అధికారి దివ్యతో చెబుతూ..) ఈ గంగమణి సక్సెస్ స్టోరీని.. బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన విజయమాల్యాకు, నీరవ్ మోడీకి ఆన్‌లైన్ లో ట్యాగ్ చేసి పంపించండి. డబ్బులు తీసుకుంటే బ్యాంకులకు ఎలా తిరిగి కట్టాలో గంగమణిని చూసి నేర్చుకోమనండి.
414 భవనాలకు భూమిపూజ చేసుకుంటున్నం: ఖమ్మం జిల్లాలో మొత్తం 571 గ్రామ పంచాయతీలకు గాను 495 వీఓ భవనాలు మంజూరయ్యాయి. ఈరోజు 414 భవనాలకు భూమిపూజ చేసుకుంటున్నాం. రుణాలు, సోలార్, పెట్రోల్ బంకుల్లో మాకు అవకాశాలు కల్పించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు సార్.
కొట్టే విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా సమాఖ్య కార్యదర్శి
సీఎం: విజయలక్ష్మి..మీరు, మీ కలెక్టర్ ఒక మంచి కార్యాచరణ పెట్టుకుని పర్యవేక్షించాలి. ఈ భవనాలన్నింటినీ డిసెంబర్ 9వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలి. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ ఉత్సవాలు జరుపుకుందాం. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. మిల్లర్లకు ధాన్యం ఇస్తుంటే, కొన్నిచోట్ల గోడౌన్ల నుంచి ధాన్యం మాయమైపోతోంది.
మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున గోడౌన్లు, సోలార్ నెట్ జీరో పద్ధతిలో కట్టించాలి. అక్కడ ఏదైనా తడిసిన పంట ఉంటే ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉపాధి హామీ పథకం కింద కల్లాలు కూడా నిర్మించాలి. కలెక్టర్.. వెంటనే స్థలాన్ని సేకరించి మహిళలకు అప్పగించడం నీ బాధ్యత. ఇది మొత్తం రాష్ట్రానికే ఒక ‘మోడల్ లాజిస్టిక్ పార్క్’ లాగా ఉండాలి.
పెట్రోల్ బంక్‌తో 27 లక్షల లాభం పొందినం
మా జిల్లా సమాఖ్య సంఘం ద్వారా ఒక పెట్రోల్ బంక్ రన్ అవుతోంది సార్. దీని ద్వారా మాకు 15 నెలల్లో రూ. 61 లక్షల టర్నోవర్ జరిగితే, ఖర్చులు పోగా రూ. 27 లక్షల నికర లాభం వచ్చింది. దీన్ని అన్ని జిల్లాలకు వర్తింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు అన్ని మండలాలకు బస్సులు ఇచ్చారు.
బస్సుల ద్వారా మండల సమాఖ్యలకు నెలకు రూ. 20 వేల వరకు ఆదాయం వస్తోంది. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి’ అనే మీ నినాదాన్ని ఐకేపీ సెంటర్లు ఇవ్వడం, యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలు ఇవ్వడం, పాఠశాల కమిటీలకు మహిళలను చైర్మన్లుగా నియమించడం ద్వారా ప్రాక్టికల్‌గా నిజం చేసి చూపిస్తున్నారు.
అరుంధతి, నారాయణపేట జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్
సీఎం: అరుంధతి.. ఆ పెట్రోల్ బంకును నేనే స్వయంగా ప్రారంభించా. కాబట్టి మీ జిల్లా మహిళలే రాష్ట్రంలోని మిగతా అందరికీ ఆదర్శంగా ఉండాలి. నారాయణపేట కలెక్టర్.. ఈ జిల్లాపై నువ్వు పర్సనల్ మానిటరింగ్ చేయాలి. ఐకేపీ సెక్టార్లు, గోడౌన్ల కోసం రవాణా సౌకర్యం ఉన్న మంచి ల్యాండ్ చూడు. అక్కడ గోడౌన్స్, లాజిస్టిక్స్ పార్క్స్, అలాగే రైస్ మిల్స్ ఏర్పాటు చేయడానికి బ్యాంకు లింకేజ్ ఇప్పించాలి.
మన దగ్గర కొత్తగా కొడంగల్ పామాయిల్ ఫ్యాక్టరీని కట్టాలనుకుంటున్నాం కాబట్టి పామాయిల్ తోటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులను ప్రభుత్వ బస్సులు పెట్టి ఆల్రెడీ పామాయిల్ తోటలు ఉన్న సిద్దిపేట, ఖమ్మం ప్రాంతాలకు తీసుకెళ్లండి. ఎకరాకు ఎంత లాభం వస్తుందో చూపిస్తే పంట మార్పిడి వేగంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో మహిళా సంఘాలనే పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి, వారికి అవసరమైన ఖర్చులన్నీ ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తుంది.
ఏ ప్రభుత్వం కూడా ఇలా పట్టించుకోలే
మా ఖమ్మం జిల్లాలో 8 ఎఫ్‌పీసీలు ఉన్నాయి. ఒక్క మా సిరివెన్నెలలోనే 2,135 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. మా చిన్న, సన్నకారు రైతుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి వీలుగా 8 గోడౌన్లు సాంక్షన్ అయ్యాయి. ఏ ప్రభుత్వం కూడా మహిళా రైతులకు ఇలాంటి బిల్డింగులు, గోడౌన్లు ఇవ్వలేదు సార్.
కృష్ణవేణి, ఖమ్మం జిల్లా సిరివెన్నెల ఎఫ్‌పీసీ అధ్యక్షురాలు
సీఎం: మహిళలు భవనాల్లో సంఘాల మీటింగ్‌లు పెట్టేటప్పుడు ‘పంట మార్పిడి’ (పామాయిల్, మిర్చి, పత్తి) మీద కూడా ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. కేవలం ‘వరి’ పండించడం మనకు పరిష్కారం కాదు, లాభసాటిగా ఉండే వాణిజ్య పంటల వైపు మారాలి.
రైతు వేదికలకు వెళ్లి పంట మార్పిడిపై అవగాహన కల్పించే మహిళా ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున కొంత ఫీజు (రెమ్యునరేషన్) కూడా ఇస్తాం. విపరీతంగా రసాయన ఎరువులు వాడటం వల్ల క్యాన్సర్ పెరుగుతోంది, అందుకే సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయంపై మహిళలు అవగాహన పెంచాలి.
