పరీక్షల ఫలితాల్లో తప్పులొస్తే వీసీలదే బాధ్యత: పాపిరెడ్డి

పరీక్షల ఫలితాల్లో తప్పులొస్తే వీసీలదే బాధ్యత: పాపిరెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: యూనివర్సిటీ పరీక్షల ఫలితాల్లో తప్పులకు వీసీలదే బాధ్యతని విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. వర్సిటీ ఎగ్జామ్స్‌‌ను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణ విభాగంపైనే భారమంతా వేయకుండా వాల్యుయేషన్‌‌ పర్యవేక్షణకూ కమిటీ వేయాలన్నారు. ఇంటర్‌‌ ఫలితాల అవకతవకల నేపథ్యంలో వర్సిటీ పరీక్షల విధానంలో సంస్కరణలపై వర్సిటీల వీసీలతో గురువారం జనార్దన్‌‌రెడ్డి, పాపిరెడ్డి సమీక్ష జరిపారు. లోపాలు జరగకుండా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సూచనల కోసం ఉన్నత విద్యామండలి వైస్‌‌ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ రాంచంద్రం, కాకతీయ వర్సిటీ వీసీ సాయన్న, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ఖాజా ఆల్తాఫ్‌‌ హుస్సేన్‌‌లతో కమిటీ వేశారు. ప్రస్తుత విధానంపై వారు అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదికిస్తారు. సమీక్ష తర్వాత జనార్దన్‌‌రెడ్డి, పాపిరెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీ పరీక్షలకు ఫ్లైయింగ్‌‌, సిట్టింగ్ స్వ్కాడ్‌‌ను నియమించాలన్నారు. పేపర్దు దిద్దేప్పుడు లెక్చరర్లు, సిబ్బందికి మార్గదర్శకాల గురించి చెప్పాలని, తప్పులు జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్సర్‌‌ షీట్స్‌‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పేపర్లుదిద్దే కేంద్రాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.