బాలికపై కౌన్సిలర్ ​అత్యాచారయత్నం

బాలికపై కౌన్సిలర్ ​అత్యాచారయత్నం
  •      కారులో తీసుకువెళ్తానని నమ్మించిన బోధన్​ ప్రజాప్రతినిధి   
  •     చితకబాదిన స్థానికులు
  •     పోక్సో కేసు నమోదు చేసిన ఎడపల్లి పోలీసులు  

నిజామాబాద్/ ఎడపల్లి/బోధన్​, వెలుగు: బోధన్​ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్​ కొత్తపల్లి రాధాకృష్ణ 17 ఏండ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఎడపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనడానికి సోమవారం శక్కర్​నగర్ చౌరస్తా నుంచి నిజామాబాద్​కు ఆటో రిక్షాలో  బయలుదేరిన బాలికను కారులో ఫాలో చేసిన రాధాకృష్ణ ఎడపల్లి బస్టాండ్​ వద్ద దింపాడు. 

తాను నిజామాబాద్​ వెళ్తున్నానని నమ్మించి కారులో  కూర్చోబెట్టుకున్నాడు. తను ఉండే వార్డు కౌన్సిలర్​కావడంతో బాలిక ఈజీగా అతడిని విశ్వసించింది. అప్పటికే చీకటి పడుతుండగా మంగల్​పాడ్​ విలేజ్​వెళ్లే దారిలో రోడ్​ పక్కన కారును ఆపి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఏడ్వడంత రాత్రి 9 గంటల టైంలో దగ్గర్లోని వైన్స్​కు కొద్ది దూరంలో కారు ఆపి బీర్​ కొనుక్కోవడానికి వెళ్లాడు. అటు బైక్​పై వెళ్తున్న ఇద్దరు కారులో ఏడుస్తున్న బాలికను చూసి ప్రశ్నించగా జరిగిన సంగతి  చెప్పింది. వారు తెలిసిన మరికొందిరికి ఫోన్​చేసి అక్కడికి పిలిపించారు. 

బీరుతో  తిరిగి వస్తున్న రాధాకృష్ణను అందరూ కలిసి చితకబాదారు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు రాధాకృష్ణను అదుపులోకి తీసుకొని బాలికను జీజీహెచ్​ హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే విషయం బోధన్​వరకు చేరడంతో బాలిక సంబంధీకులు వందల సంఖ్యలో పీఎస్​కు వచ్చారు. రాధాకృష్ణను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్​నుంచి వేరే చోటికి తీసుకువెళ్లారు. 

నిందితుడిని బోధన్​ కోర్టులో హాజరుపర్చడానికి తీసుకువెళ్తున్నారని తెలుసుకున్న బాలిక మద్దతుదారులు మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. దీంతో సీపీ కల్మేశ్వర్​అదనపు ఫోర్స్​ పంపారు. ఏడాదిలో రెండో కేసు కౌన్సిలర్​ రాధాకృష్ణ తమ్ముడు రవీందర్​ గత ఏడాది మార్చి 19న 13 ఏండ్ల బాలికపై అత్యాచారం చేయగా బోధన్​లో  కేసు నమోదైంది. తమ్ముడిని కాపాడడానికి బాధిత బాలిక తల్లిని బెదిరించడంతో రాధాకృష్ణపై కూడా కేసు ఫైలయ్యింది. తాజాగా ఇప్పుడు పోక్సో కేసు రిజిష్టరయ్యింది.