కరీంనగర్: ఇల్లందు మండలం సీతంపేట గ్రామంలో ఎస్ఐ చంద్రశేఖర్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తన చివరి కోరిక మేరకు అత్తవారి ఊరిలోనే దివ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన చోటనే భర్త అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రశేఖర్ పెద్ద కొడుకు తండ్రి చితికి తలకొరివి పెట్టాడు. భార్య దివ్య లేని జీవితం తనకు వద్దంటూ చనిపోతానని బంధువులతో ఎస్ఐ చంద్రశేఖర్ పలుమార్లు చెప్పాడు. భార్య దివ్య చనిపోయిన తర్వాత మూడో రోజు నుంచి ఒకవేళ తను కూడా చనిపోతే తన భార్య చితి పైనే తన అంత్యక్రియలు నిర్వహించాలని చంద్రశేఖర్ కోరాడు.
కరీంనగర్ పట్టణం వన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఆమె భర్త చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. దివ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు. ఈ క్రమంలో.. సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని ఆమె బంధువులు అతనిపై దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య దివ్య తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.
►ALSO READ | ఇబ్రహీంపట్నంలో హోండా అమేజ్ కారు బీభత్సం..రోడ్డుపక్కన కూర్చున్న నలుగురిని ఢీకొట్టింది
శనివారం ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వెళ్లి అదే ఇంట్లో ఉరి వేసుకొని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గదిలో నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానంతో కిటికీ తెరిచి చూడగా ఉరి వేసుకొని ఉండడంతో తలుపు బద్ధలు కొట్టి అతనిని కిందకు దించారు. హుటాహుటిన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లీ, తండ్రి ఇద్దరూ చనిపోవడంతో వీరి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి కన్న ప్రేమకు దూరమయ్యారు.
