టైప్ 2 డయాబెటిస్ కోసం వాడే జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజక్షన్స్ వచ్చేశాయ్.. తక్కువ ధరకే..!

టైప్ 2 డయాబెటిస్ కోసం వాడే జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజక్షన్స్ వచ్చేశాయ్.. తక్కువ ధరకే..!

టైప్ 2 డయాబెటిస్, ఒబెసిటీ నివారణకు వినియోగించే సెమాగ్లుటైడ్ ఇంజక్షన్ జనరిక్ వెర్షన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇండియాలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఇంజెక్షన్ ధర రూ.8,790 వరకూ ఉంటుంది. హైదరాబాద్కు చెందిన నాట్కో ఫార్మా ఇప్పటికే సెమాగ్లుటైడ్ ఇంజక్షన్ జనరిక్ వెర్షన్ను తీసుకొచ్చింది. ఈ ఇంజెక్షన్ ధర నెలకు రూ.1,290 రూపాయలు. సన్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కూడా ఇప్పుడు ఇదే బాటను ఎంచుకున్నాయి.

సన్ ఫార్మా సెమాగ్లుటైడ్‌ జనరిక్ వెర్షన్ను నోవెల్‌ట్రీట్, సెమాట్రినిటీ అనే బ్రాండ్ పేర్లతో విడుదల చేసింది. వీటిలో మొదటిది ఒబెసిటీని తగ్గించడానికి, రెండవది టైప్ 2 డయాబెటిస్‌ను సమస్య నివారణకు ఉపయోగపడుతాయని ఈ ఫార్మా కంపెనీ తెలిపింది. నోవెల్‌ట్రీట్ కోసం వారపు థెరపీ ఖర్చులు సుమారుగా రూ. 900 నుంచి రూ. 2,000 వరకు, సెమాట్రినిటీ కోసం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఖర్చు అవుతుందని పేర్కొంది. జైడస్ లైఫ్‌సైన్సెస్ తన సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను మళ్లీ వినియోగించుకునేలా మల్టీ-డోస్ పెన్ పరికరం రూపంలో విడుదల చేసింది. ఈ మెడిసిన్ను టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం రెండింటి కోసం వాడుకోవచ్చు. సెమాగ్లిన్, మాషెమా, ఆల్టర్మే అనే పేర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నెలవారీ చికిత్స ఖర్చు సుమారు రూ. 2,200 ఉండొచ్చని అంచనా.

టైప్ 2 డయాబెటిస్ కోసం ఇండియాలోనే తొలిసారిగా DCGI -ఆమోదం పొందిన జెనరిక్ సెమాగ్లుటైడ్ అయిన ఒబెడాను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ విడుదల చేసింది. ఈ మందును వారానికి ఒకసారి ఉపయోగించడం కోసం 2 mg, 4 mg ప్రీ-ఫిల్డ్ డిస్పోజబుల్ పెన్‌లలో విక్రయిస్తున్నారు. ఈ రెండు డోసులకు నెలకు రూ. 4,200 ఖర్చు అవుతుందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తెలిపింది. సెమాగ్లుటైడ్ సూది మందును టైప్ 2 డయాబెటిస్ నిర్వహణ కోసం విడుదల చేశారు.

కానీ ఈ మందు ఆకలిని బాగా మందగించేలా చేస్తూ బరువును కూడా వేగంగా తగ్గిస్తోంది. దీంతో మన దేశంలో ఒబెసిటీని తగ్గించుకునేందుకు ఒజెంపిక్ ఇంజక్షన్ను విస్తృతంగా వాడుతున్నారు.  టైప్ 2 డయాబెటిస్ కోసం వినియోగించే ఒజెంపిక్(సెమాగ్లుటైడ్) ఇంజక్షన్ ను బరువు తగ్గేందుకు వాడితే దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూది మందు కొవ్వును మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలనూ కరిగిస్తుందని, అందుకే డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా దీనిని వాడరాదని ఎయిమ్స్ మాజీ డైటీషియన్ దీప్తా నాగ్ పాల్ వెల్లడించారు.