- వంట, బట్టలు ఉతకడం వంటి పనుల్లో సహకరించాలి
- మీరేం పని మనిషిని పెండ్లి చేసుకోవడం లేదని..
- కాలం మారిందంటూ కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: భార్య వంట, ఇంటి పనులు సరిగా చేయడం లేదనే ఆరోపణలు క్రూరత్వం కిందకు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంటి పనుల్లో భార్యకు భర్త కూడా సహకరించాలని అభిప్రాయపడింది. ‘‘మీరు పని మనిషిని పెళ్లి చేసుకోవడం లేదు. ఒక జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకుంటున్నారు. కాలం మారింది. వంట, బట్టలు ఉతకడం, ఇంటి పనుల్లో భర్త పాలుపంచుకోవాలి’ అని ఒక విడాకుల కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. ఆ దంపతులకు ప్రస్తుతం 8 ఏండ్ల కొడుకు ఉన్నాడు.
అయితే, పెళ్లైన వారం రోజులకే భార్య వైఖరి మారిందని, అప్పటి నుంచి తనను వేధిస్తోందని ఆరోపిస్తూ భర్త విడాకుల ప్రక్రియ ప్రారంభించాడు. తన తల్లిదండ్రులను(అత్త, మామలను) అసభ్య పదజాలంతో దూషించిందని, వారికి వంట చేసి పెట్టడానికి నిరాకరించిందని ఆరోపించాడు. బిడ్డ పుట్టిన తర్వాత బారసాలకు కూడా తన తల్లిదండ్రులను పిలవలేదన్నాడు.
ఈ అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొన్న ఫ్యామిలీ కోర్టు క్రూరత్వం అనే కారణంతో విడాకుల డిక్రీని మంజూరు చేసింది. ఈ డిక్రీపై భార్య హైకోర్టులో అప్పీల్ చేసింది. భర్త, ఆయన కుటుంబసభ్యుల అనుమతితోనే కాన్పు కోసం పుట్టింటికి వెళ్లినట్లు పేర్కొంది. వారు ఉయ్యాల కార్యక్రమానికి హాజరు కాలేదని, నగదు, బంగారం కోసం డిమాండ్ చేశారని ఆరోపించింది. తన జీతాన్ని కూడా బలవంతంగా ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది.
దీంతో హైకోర్టు విడాకుల డిక్రీని రద్దు చేయగా.. భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్ బెంచ్ ఈ మేరకు కీలక కామెంట్లు చేసింది. తదుపరి విచారణకు దంపతులిద్దరు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ విడాకుల కేసు పరిష్కారం కోసం కోర్టు మధ్యవర్తిత్వానికి కృషి చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది
