కీసరలో భూకబ్జా గుట్టురట్టు..చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్.. ఐదుగురు అరెస్ట్

కీసరలో భూకబ్జా గుట్టురట్టు..చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్.. ఐదుగురు అరెస్ట్

ఖాళీ ప్లాట్ కనిపిస్తే చాలు కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. అసలు యజమాని చనిపోయాడని తెలుసుకున్న కొందరు కేటుగాళ్లు, ఏకంగా అదే పేరున్న మరో వ్యక్తిని సృష్టించి కోట్లు విలువ చేసే భూమిని కాజేయాలని చూశారు. ఈ భూకబ్జా, అక్రమ ప్లాట్ రిజిస్ట్రేషన్ కేసు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని కుందానిపల్లిలోని చాముండిపట్నం TPS కాలనీకి చెందిన ఓ ప్లాట్ కబ్జా, అక్రమ ప్లాట్ రిజిస్ట్రేషన్ కేసులో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లాట్ యజమాని కుమార్తె మాదను మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉప్పల వేణు, దొనపటి వెంకట రెడ్డి, నకిలీ యజమాని మాదను ఇన్నయ్య, అతని కుమార్తె గుండిగ జ్యోతి, డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కుట్ర జరిగిందిలా..

కుందానిపల్లిలోని చాముండిపట్నం TPS కాలనీలో మాదను ఇన్నయ్య అనే వ్యక్తి 1988లో ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. ఆయన 2021లో మరణించారు. ఆ ప్లాట్ ఖాళీగా ఉండటాన్ని గమనించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉప్పల వేణు, దొనపాటి వెంకట రెడ్డి, ఆ భూమిని అక్రమంగా విక్రయించాలని ప్లాన్ వేశారు.అసలు యజమాని పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని (నకిలీ ఇన్నయ్య) పట్టుకున్నారు.నకిలీ ఇన్నయ్యకు, అతని కుమార్తె గుండిగ జ్యోతికి డబ్బు ఆశ చూపి ఈ కుట్రలో భాగస్వాములను చేశారు. కీసర సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ సహాయంతో సంబంధిత అధికారుల సహకారంతో నకిలీ గిఫ్ట్ డీడ్ (Doc No. 10462/2025) నమోదు చేయించారు.

►ALSO READ | మధ్యాహ్న భోజన పథకంపై విమర్శల వీడియోపై స్పందించిన గరికపాటి !

అసలు యజమాని ఇన్నయ్య కుమార్తె మాదను మాధురికి ఈ విషయం తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి పేరుతో వేరే వ్యక్తులు అక్రమంగా భూమిని బదలాయించుకున్నారని ఫిర్యాదు చేయడంతో అసలు మోసం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు విచారణ చేపట్టి, శుక్రవారం (మార్చి 20) ఐదుగురు నిందితులు ఉప్పల వేణు, దొనపాటి వెంకట రెడ్డి (రియల్టర్లు), మాదను ఇన్నయ్య (నకిలీ యజమాని), గుండిగ జ్యోతి, ప్రసాద్ (డాక్యుమెంట్ రైటర్) లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎ-6 నిందితుడిగా ఉన్న అప్పటి సబ్-రిజిస్ట్రార్‌ పాత్రపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.