
షార్ట్ కట్ పొలిటీషియన్లను ప్రజలు తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. షార్ట్ కట్ పొలిటీషియన్లు పన్ను చెల్లింపుదారులకు శత్రువులన్నారు, దేశ ఆర్థిక సంక్షేమం కన్నా తమ పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని ఆరోపించారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోడీ.. నాగపూర్ లో ఎయిమ్స్ ను ప్రారంభించారు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.
అంతకుముందు బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ను మోడీ ప్రారంభించారు. 520 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నాగపూర్-షిరిడీలను అనుసంధానం చేస్తుంది. నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1ను కూడా మోదీ ప్రారంభించారు. ఆయన టిక్కెట్ కౌంటర్ లో టిక్కెట్ కొని, మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థినీ, విద్యార్థులతోనూ, సమాజంలోని వివిధ రంగాలకు చెందినవారితోనూ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతోనూ ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 6వ వందే భారత్ రైలును ప్రారంభించారు. రైలులోని ప్రయాణికులను చేతులు ఊపుతూ పలుకరించి, ఉత్తేజపరచారు. వందేభారత్ రైలు నాగపూర్-బిలాస్ పూర్ మధ్య నడుస్తుంది.