హలీమ్ ప్రియులకు చేదు వార్త!

హలీమ్ ప్రియులకు చేదు వార్త!

మ‌రో వారం రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ‌మవుతుంది. అయితే ప్ర‌తీ ఏడాది రంజాన్ వేళ హైదరాబాదీలు ఇష్టంగా తినే హలీమ్ వంటకం ఈసారి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుండటమే దీనికి కారణం. ప్ర‌జ‌ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌తీ రంజాన్ కు నగరంలోని ప్రతి ప్రాంతంలో వెలిసే హలీమ్ సెంటర్‌లు ఈసారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా తెరిచే అవ‌కాశం లేదు. ముస్లిం సోద‌రులతో పాటు హిందువులు కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ ప్ర‌త్యేక వంట‌కాన్ని ఈసారి అందుబాటులో తేలేమని దాని త‌యారీదారులే చెబుతున్నారు.

హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహద్ అబ్దుల్ మజీద్ దీనిపై మాట్లాడుతూ.. తాము హైదరాబాద్ శివార్లలోని చెంగిచ‌ర్ల కబేళా నుండి నాణ్యమైన మాంసాన్ని తీసుకోస్తామ‌ని, అయితే లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది క‌బేళా మూసివేయబడిందని చెప్పారు. అంతేకాకుండా, ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు రెస్టారెంట్లు, హోట‌ల్స్ మూసివేసిన త‌ర్వాత అందులో ప‌నిచేసే సిబ్బంది వారి సొంతూళ్ల‌కు వెళ్లార‌ని తెలిపారు.త‌మ అసొసియేష‌న్ మొద‌ట స్విగ్గీ జోమాటోల ద్వారా హోమ్ డెలివ‌రీ ఇవ్వాల‌నుకున్న‌ద‌ని, కానీ సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత లాక్ డౌన్ నిబంధ‌న‌ల దృష్ట్యా అది సాధ్య‌ప‌డ‌ద‌ని ఆయ‌న అన్నారు. మొత్త‌మ్మీద భోజ‌న ప్రియులు ఈ ఏడాది మాత్రం హలీమ్‌ను మిస్స‌వుతార‌నే చెప్ప‌వ‌చ్చు.