
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అర్బన్ ప్రైమరీ హెల్త్ (పీహెచ్‌సీ) సెంటర్‌లో దొంగలు కరోనా వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. తాళాలు పగులగొట్టి 17 కొవిషీల్డ్, 27 కొవాగ్జిన్ వయల్స్‌ను ఎత్తుకెళ్లారు. రెండు కంప్యూటర్లు, టీవీ, పీహెచ్‌సీ బయట ఉన్న ఆటోను ధ్వంసం చేశారు. జాంబాగ్ కాళీ కబర్‌లోని పీహెచ్‌సీలో రోజూ కరోనా టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సిన్లను కూడా వేస్తున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పీహెచ్‌సీ తాళాలు పగులగొట్టి, వ్యాక్సిన్ వయల్స్‌తో పాటు మెడికల్ కిట్లను ఎత్తుకెళ్లారు. సోమవారం డ్యూటీకి వచ్చిన సిబ్బంది పీహెచ్‌సీ తలుపులు తెరిచి చూడగా, దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో డాక్టర్లకు సమాచారమివ్వగా, వారు మీర్‌పేట్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పీహెచ్‌సీని సందర్శించి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.