యూకేలో కొత్త రకం కరోనా...

యూకేలో  కొత్త రకం కరోనా...

లండన్: యూకేలో కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్  ‘ఎరిస్’  దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. దీనికి ఈజీ.5.1గా పేరుపెట్టారు. ఒమైక్రాన్  నుంచి ఈ వేరియంట్  వచ్చిందని డాక్టర్లు తెలిపారు. గత నెలలో యూకేలో బయటపడిన ఎరిస్ వేరియంట్.. ఇపుడు దేశవ్యాప్తంగా  వ్యాపిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న ప్రతీ ఏడు కేసుల్లో ఒకటి ఎరిస్ దేనని, ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 14.6% కేసులు ఎరిస్ వే అని యూకే హెల్త్  సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) వెల్లడించింది. ప్రస్తుతం యూకేలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న రెండో వేరియంట్  ఎరిస్  అని తెలిపింది. ‘‘గత  రిపోర్టుతో పోలిస్తే కరోనా కేసులు ఈ వారం పెరిగాయి. రెస్పిరేటరీ డేటా మార్ట్  సిస్టం ద్వారా గుర్తించిన 4,396 కేసుల్లో 5.4% కొవిడ్ 19గా తేలింది. 

అలాగే జూలై 31న ఎరిస్  వేరియంట్ ను గుర్తించాం. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల వల్ల దేశంలో ఈ వేరియంట్  వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఈవారం కరోనా కేసులు మరింత పెరిగాయి. అలాగే చాలా ఏజ్  గ్రూపుల వారు హాస్పిటల్స్ లో చేరారు. వారిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. ఓవరాల్ గా అడ్మిషన్ల సంఖ్య తక్కువగానే ఉంది” అని యూకేహెచ్ఎస్ఏ హెడ్  డాక్టర్  మేరీ రామ్ సే తెలిపారు. ఇక కరోనా వైరస్, ఇతర రకాల వేరియంట్లు, బగ్స్ ను అడ్డుకునేందుకు చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవాలని ఆమె సూచించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని, క్వారంటైన్  కావాలని చెప్పారు.