రాత్రి 10 గంటల వరకు వ్యాక్సిన్​ సెంటర్లు

రాత్రి 10 గంటల వరకు వ్యాక్సిన్​ సెంటర్లు
  •    రాత్రి 10 గంటల వరకు ఓపెన్​ చేసుకోవచ్చు
  •    రాష్ట్రాలు, యూటీలకు  కేంద్ర ప్రభుత్వం సూచన

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్​ సెంటర్ల నిర్వహణకు ఎలాంటి టైం లిమిట్​ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. సిబ్బంది, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను బట్టి రాత్రి 10 గంటల వరకు కూడా వ్యాక్సిన్​ సెంటర్లు తెరిచి ఉంచొచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రస్తుతం సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు  మాత్రమే కొనసాగుతాయనే అభిప్రాయం ఉందని, కానీ ఎలాంటి టైం లిమిట్​ పెట్టుకోవద్దని హెల్త్​ మినిస్ట్రీ అడిషనల్​ సెక్రటరీ మనోహర్​ సోమవారం తెలిపారు. అందరికీ వ్యాక్సిన్​ అందించడమే లక్ష్యమని, డిమాండ్​ను బట్టి రాత్రి పది గంటల వరకు కూడా సెంటర్లు కొనసాగేలా స్టాఫ్​ను, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్​ సెంటర్ల వద్ద తప్పనిసరిగా కరోనా​ గైడ్​లైన్స్​ అమలుచేయాలని, క్యూలైన్లలో ఫిజికల్​ డిస్టెన్స్​ ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలు, యూటీలకు లెటర్​ రాశారు. కరోనాపై పోరాటానికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎప్పటిలానే కేంద్రం ప్రభుత్వం పూర్తి సహకరిస్తుంటుందని స్పష్టంచేశారు. కాగా, సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఫ్రంట్​లైన్​ వారియర్లు​, హెల్త్​ వర్కర్లు​, 60 ఏండ్లు పైబడినవాళ్లకు బూస్టర్​ డోస్​(మూడో డోస్​) వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది.