ఆవుల రక్షకుడు ఈ బాలకృష్ణుడు

ఆవుల రక్షకుడు ఈ బాలకృష్ణుడు

కబేళాకి పంపుతున్న లేగదూడల అరుపులు విని ఒక యువకుడు చలించిపోయాడు. ఆ అరుపులు అతడి మనసును కదిలించాయి. తల్లి నుంచి విడదీస్తున్నప్పుడు లేగ దూడలు పడుతున్న బాధ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎలాగైనా వాటిని కాపాడాలనుకున్నాడు. రెట్టింపు ధర ఇచ్చి మరీ వాటిని కొన్నాడు. తనకు పశువుల అవసరం లేకున్నా కేవలం వాటిని రక్షించాలనే ఉద్దేశంతో  సంరక్షిస్తున్నాడు.

సూర్యాపేటలో ఉంటున్న కల్లూరి బాలకృష్ణ వ్యాపారం చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం ఒకసారి తన ఫ్రెండ్‌‌తో కలిసి పశువుల సంతకు వెళ్లాడు. తన ఫ్రెండ్ ‘గృహ ప్రవేశం’ కోసం ఒక ఆవును కొన్నాడు. అక్కడ తల్లుల నుంచి విడదీసి.. వెహికిల్‌‌ ఎక్కిస్తున్న కోడెలు, దూడల అరుపులు విని తల్లడిల్లిపోయాడు. వాటిని కాపాడాలి అనుకున్నాడు. కబేళాకి వెళ్తున్న ఆ వెహికిల్‌‌ను ఆపి పశువులను తనకు అమ్మాలని అడిగాడు. కానీ.. వ్యాపారులు ఒప్పుకోలేదు. చివరకు వాటి ఖరీదుకు రెట్టింపు డబ్బు ఇవ్వడంతో వ్యాపారులు వాటిని బాలకృష్ణకు ఇచ్చేశారు. అప్పటి నుంచి వాటి బాగోగులు తానే చూస్తున్నాడు.

ఇప్పుడు ఆయన దగ్గర మొత్తం పదహారు పశువులు ఉన్నాయి. వాటితో ఎటువంటి పనులు చేయించడం లేదు. కనీసం ఆవు పాలను కూడా పితక్కుండా దూడలకే వదిలేస్తున్నాడు. ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో గోవుల సంరక్షణ కోసం లక్షన్నర ఖర్చు చేసి ఒక షెడ్డు వేయించాడు. ఏడాదికి లక్ష రూపాయలు జీతం ఇచ్చి ఒక కేర్‌‌‌‌ టేకర్‌‌‌‌ని కూడా నియమించాడు. పాముకాటుతో ఈ మధ్య ఒక ఆవు చనిపోవడంతో షెడ్డు చుట్టూ చిన్న పురుగు కూడా వెళ్లకూడదని ఇనుప గ్రిల్‌‌ వేయించాడు. ఆవులకు దోమలు కుట్టకుండా షెడ్డులో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయించాడు బాలకృష్ణ.

ప్రతి రోజు 200 ఖర్చు

ఆవుల మేతకు తన పొలంలోని గడ్డి సరిపోకపోవడంతో బయట నుంచి కూడా కొంటున్నాడు. తన సంపాదనలో ప్రతి రోజు 200 రూపాయలు పశువుల సంరక్షణ కోసం పొదుపు చేస్తున్నాడు. ఆ డబ్బును పశువులకు దాణా, వైద్యానికి ఖర్చు చేస్తున్నాడు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. దాతలు ఎవరైనా గడ్డి సాయం చేస్తే ఎన్ని పశువులనైనా సంరక్షిస్తానని చెపుతున్నాడు బాలకృష్ణ. తన షెడ్డులో పశువులు 25కు మించితే వాటిని పేద రైతులకు ఉచితంగా ఇస్తానని ఆయన చెప్తున్నాడు.