
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలోనే అతి పురాతనమైన, ఎంతో పేరున్న హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్ఠను మరింత పెంచాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సిటీలోని అన్ని పోలీస్వింగ్స్ అధికారులు, సిబ్బందితో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పలు కీలక సలహాలు, సూచనలు జారీ చేశారు. మానవతా దృక్పథంతో పనిచేసి, ప్రజల మన్ననలు పొందే సిబ్బందిని ప్రోత్సహించేందుకు త్వరలో ఎక్స్ట్రా మైల్ రివార్డ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
ఇందులో భాగంగా ప్రతి శనివారం ఉత్తమ సిబ్బందిని గుర్తించి, ప్రశంసాపత్రం రివార్డుతో సన్మానిస్తామన్నారు. సిటీని డ్రగ్ రహిత నగరంగా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, డ్రగ్స్ కేసులను లోతుగా దర్యాప్తు చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లో కష్టపడి పనిచేసిన సిబ్బందిని సీపీ అభినందించారు.
ఇటీవల మాదన్నపేటలో చిన్నారి హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. నిరాశ్రయులను ఆదరించి ఆశ్రమానికి తరలించిన అఫ్జల్‌గంజ్ ఎస్ హెచ్వో రవి, ఎస్సై నిరంజన్, ఏఎస్సై ధర్మేందర్ ప్రశంసించారు. అలాగే, ఒక కేసులో 30 ఏండ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఫిలింనగర్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ ను కూడా ఆయన అభినందించారు.