జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, వారిని మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న చంద్రశేఖర్ ఆజాద్, రాజు అనే ఇద్దరు నిందితులను పోలీసులు ప్రస్తుతం కస్టడీలో విచారిస్తున్నారు.
ఈ సమయంలో స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్.. నిందితులపై జరుగుతున్న దర్యాప్తు తీరును స్వయంగా సమీక్షించారు. నిందితులను వ్యక్తిగతంగా విచారించిన అనంతరం.. కేసు తీవ్రతను బట్టి మైనర్లపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారించి పూర్తి వివరాలను బయటపెట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
