
హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం (అక్టోబర్ 13) సేఫ్ రైడ్ ఛాలెంజ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సజ్జనార్. పౌరుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడమే ఈ సేఫ్ రైడ్ ఛాలెంజ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా వాహనదారులు తమ ప్రయాణం స్టార్ట్ చేసే ముందు.. బైక్‌పై వెళ్లే వారు అయితే హెల్మెట్ ధరించాలి.. కారులో ప్రయాణించే వారైతే సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. ఇలా భద్రతా చర్యలను పాటిస్తూ ఒక చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీసి ముగ్గురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
వారిని కూడా అలాగే చేయమని ఛాలెంజ్ విసిరాలి. అచ్చం చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఛాలెంజ్ మాదిరిగా అన్నమాట. స్టాలిన్ మూవీలో చిరంజీవి ఒకరికి సహయం చేసి.. ఆ ఒక్కొరిని మరో ముగ్గురికి.. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహయం చేయమని చెప్పినట్లుగా అన్నమాట.
సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదని.. మీ ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీకు ఇష్టమైన వారిని రక్షించుకునే నిర్ణయంతో మొదలవుతుందని పేర్కొన్నారు సజ్జనార్. సేఫ్ రైడ్ ఛాలెంజ్ కార్యక్రమంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనాలని.. మనం అందరం కలిసి సేఫ్టీని 2025లో కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదామని వాహనదారులకు పిలుపునిచ్చారు. సజ్జనార్ సేఫ్ రైడ్ చాలెంజ్ కు యువత నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. వాహనదారులు పెద్ద ఎత్తున సేఫ్ రైడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.