ఎన్ డీపీఎస్ యాక్ట్​పై జనాలకు అవగాహన కల్పిస్తాం..: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

ఎన్ డీపీఎస్ యాక్ట్​పై జనాలకు అవగాహన కల్పిస్తాం..: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

గచ్చిబౌలి, వెలుగు: ఎన్ డీపీఎస్ (నార్కోటిక్​డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్ స్టానెన్స్) యాక్ట్ గురించి పోలీస్ అధికారులకు తెలిసుండాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఎన్​డీపీఎస్ యాక్ట్​కు సంబంధించిన బుక్ ను గురువారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్ డీపీఎస్ యాక్ట్ కు సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్, ఇన్వెస్టిగేషన్ పద్ధతులు, మిగతా ప్రాసెస్​ను తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో నార్కొటిక్, సైకోట్రోపిక్ పదార్థాల వాడకం విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలుంటాయన్నారు.

 మెదడు, నాడీ వ్యవస్థపై ఈ డ్రగ్స్ ఎఫెక్ట్​ తీవ్రంగా ఉంటుందన్నారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ పై జనాలకు అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ యాక్ట్ కింద డ్రగ్స్ సప్లయర్లకు జీవితఖైదు, డెత్ పెనాల్టీ పడే అవకాశం ఉందన్నారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ బుక్​రాయడంలో సహకరించిన రిటైర్డ్ ఎస్పీ, సైబరాబాద్ ఓఎస్డీ మల్లారెడ్డి, ఏసీపీ రవీందర్, సెంట్రల్ ట్యాక్స్ సూపరింటెండెంట్ రంగనాథంను సీపీ రవీంద్ర అభినందించారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్,  డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ నిఖితా పంత్,  అడ్మిన్ డీసీపీ యోగేశ్, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.