గద్దర్‌‌ నక్సలైట్‌‌ అయితే మోదీ సంతాపం ఎందుకు తెలిపినట్టు ? : కె.నారాయణ

గద్దర్‌‌ నక్సలైట్‌‌ అయితే మోదీ సంతాపం ఎందుకు తెలిపినట్టు ? :  కె.నారాయణ
  • అమిత్‌‌ షా వ్యాఖ్యలు సరికాదు
  • సీపీఐ జాతీయ కంట్రోల్‌‌ కమిషన్‌‌ చైర్మన్‌‌ కె.నారాయణ  

హనుమకొండ, వెలుగు : ‘కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌షా పార్లమెంట్‌‌ సాక్షిగా కమ్యూనిస్టులు, మావోయిస్టుల పట్ల అక్కసు వెల్లగక్కారు, నక్సలైట్‌‌ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన గద్దర్‌‌ను నక్సలైట్‌‌ అని సంబోధించారు, మరి గద్దర్‌‌ చనిపోతే ప్రధాని మోదీ ఎందుకు సంతాపం వ్యక్తం చేశారు’ అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్‌‌ చైర్మన్‌‌ కె.నారాయణ ప్రశ్నించారు. హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ ఆఫీస్‌‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

గద్దర్‌‌పై అమిత్‌‌ షా వ్యాఖ్యలు సరికాదన్నారు. గద్దర్‌‌ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీని అరెస్ట్‌‌ చేస్తారా ? లేదంటే అబద్ధాలు చెప్పిన అమిత్‌‌షాపై కేసు పెడతారా అని నిలదీశారు. 12 మందిని చంపించి నిర్దోషిగా ప్రకటించుకున్న చరిత్ర అమిత్‌‌షాకు ఉందని ఆరోపించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని మొదట కోరింది తామేనని, ఆపరేషన్‌‌ కగార నిలిపివేసి ఇరువర్గాలు కాల్పుల విరమణ పాటించాలని సూచించామన్నారు. 

కానీ కేంద్రం అమానుషంగా వ్యవహరించి హిడ్మా వంటి వందలాది మంది మావోయిస్టులను ఎన్‌‌కౌంటర్‌‌ చేయించిందని ఆరోపించారు. లొంగిపోయిన మావోయిస్ట్‌‌లకు కూడా ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వస్తామని చెప్పిన మావోయిస్టు నాయకులు కూడా.. పోలీసుల ఒత్తిడి కారణంగానే ఆగిపోయారన్నారు. 40 ఏండ్ల పాటు జీవితాలను త్యాగం చేసిన మావోయిస్ట్‌‌ నేతలు బూర్జువా పార్టీలతో కలవకుండా వామపక్ష ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి నష్టం కలిగిస్తున్న అమెరికా యుద్ధోన్మాదంపై ప్రధాని మౌనం వీడాలని సూచించారు. 

ట్రంప్‌‌ వ్యతిరేకంగా అమెరికాలోనే నిరసనలు వ్యక్తం అవుతుంటే.. మన ప్రధాని మోదీ మాత్రం బలహీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. క్రిస్టియన్లలో చేరితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న తీర్పు సరికాదని, ఏ మతంలో చేరినా కులం ఎన్నటికీ మారదన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి పాల్గొన్నారు. అనంతరం ములుగులో ‘ఇంటింటా సీపీఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలసుకుని, ప్రభుత్వ పథకాల అమలు స్థితిని పరిశీలించి వాటి కోసం పోరాటం చేస్తామని చెప్పారు.