కరీంనగర్ సిటీ/ గోదావరిఖని/నేరడిగొండ, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బజారున పడ్డాయని, లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. ఢిల్లీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వేలాదిగా తరలివచ్చి ఆందోళన చేస్తుంటే వారిపై బీజేపీ ప్రభుత్వం పాశవికంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అశోక్, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలి
నీట్ పేపర్ లీకేజీ వల్ల విద్యార్థుల మరణానికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రభుత్వం నుంచి భర్తరఫ్ చేయాలని సీపీఐఎంఎల్న్యూడెమోక్రసీ లీడర్లు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చైరస్తాలో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఇ.నరేశ్, లీడర్లు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పత్రం లీక్ చేసి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందన్నారు. పేపర్ లీక్‌తో ఏండ్లపాటు కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు 21 ప్రాణాలు తీసుకున్నారని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు ఇ.రామకృష్ణ, ఐ.రాజేశం, మల్లేశం, పి.స్వామి, దుర్గయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీజీవీపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో టీజీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
