- సీపీఐ నేత నారాయణ ప్రశంసలు
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025’ను అత్యంత విజయవంతంగా నిర్వహించినందుందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ చురుకుగా పనిచేసి ఈ సమిట్‌ను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు.
దాదాపు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిసిందని.. ఇంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక అభినందనలను అని నారాయణ తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే ఇండస్ట్రియల్ అభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న భూములు పెట్టుబడులకు అనువుగా ఉంటాయని, అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. ప్లానింగ్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధి చేపడితే రానున్న రోజుల్లో అభివృద్ది మరింత పెరుగుతుందని తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు అనుమతులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగకుండా చూడాలని నారాయణ సూచించారు.

