కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. వివేక్ ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు : నారాయణ

కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. వివేక్ ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు : నారాయణ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. హైదరాబాద్ సిటీలో రోడ్లు వేసినా, కొత్తగా షాపింగ్ మాల్స్ కట్టినా.. అన్నింటిలోనూ మంత్రి కేటీఆర్ కు వాటా ఉంటుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకట స్వామి ఇండ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ, ఈడీ దాడులు అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చేయకపోవడమే.. బీఆర్ఎస్, బీజేపీకి సపోర్టు చేస్తోందని అర్థమవుతోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్శిటీ.. అలాంటి ఓయూకు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా..? అని ఛాలెంజ్ చేశారు. 

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు - ప్రభుత్వ వైఫల్యాలు - ఎన్నికల నేపథ్యంలో విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ లైబ్రరీలో చర్చ గోష్టి నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ చర్చ గోష్టి జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ హాజరయ్యారు.