‘ఉపా’ చట్టాన్ని రద్దు చేయాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్‌

‘ఉపా’ చట్టాన్ని రద్దు చేయాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్‌

ముషీరాబాద్, వెలుగు: ప్రొగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ సంధ్యతో పాటు 152 మందిపై ఉన్న తాడ్వాయి కుట్ర కేసును ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా ‘ఉపా’చట్టాన్ని కూడా రద్దు చేయాలని కోరింది. తాడ్వాయి కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నేత మల్లు రవి, సారంపల్లి మల్లారెడ్డి, విమలక్క, దిడ్డి సుధాకర్, బాల మల్లేశ్‌, గోవర్ధన్, సాధినేని వెంకటేశ్వరరావు, రవి, ముర హరి, ప్రసాద్, ప్రొఫెసర్ లక్ష్మణ్ తదితరులు హాజరై మాట్లాడారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేకుల గొంతు నొక్కాలనే ఉద్దేశంతో తాడ్వాయి కుట్ర కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసును ప్రజా మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై నమోదు చేశారన్నారు. మానవ, పౌర హక్కులతో పాటు జీవించే హక్కును సైతం హరించే ఉపా చట్టం రద్దు కోసం సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని వక్తలు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు తొలగించినట్లే అందరిపైనా ఈ కేసును ఎత్తివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులపై కొనసాగుతున్న నిర్భందాన్ని ఎత్తివేసే వరకు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.