సీఎంకు పిండ ప్రదానం చేయడం అన్యాయం : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు 

సీఎంకు పిండ ప్రదానం చేయడం అన్యాయం : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి బతికుండగానే ఆయనకు పిండ ప్రదానం చేయడం అన్యాయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన అసెంబ్లీ సెషన్‌లో ఆయన మాట్లాడారు. సభ నడిచే విధానం ఇదైతే కాదన్నారు. ప్రజా సమస్యలపై మంచి ఉద్దేశంతో చర్చ జరగాల్సిన చోట ఉద్దేశపూర్వకంగా గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపల, బయట సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరూ వ్యక్తిగతంగా దూషించకుండా స్పీకర్ ప్రత్యేకంగా ఒక డిక్రీ పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దళితులు డప్పులు కొట్టిన చోట పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుడికి వెళ్లినప్పుడు బీజేపీ నేతలు ఎలా వ్యవహరించారో, రాష్ట్రంలోనూ అలాగే జరిగిందని విమర్శించారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరుగుతున్నాయా లేదా అనేది తనకు తెలియదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పూర్తికాల సస్పెన్షన్‌ను తగ్గించుకునేందుకు స్పీకర్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని, తనను కలిసిన బీఆర్ఎస్ నేతలకు కూడా ఇదే సలహా ఇచ్చినట్టు కూనంనేని స్పష్టం చేశారు.