
హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ విధానాన్ని కాపాడుకునేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. బీజేపీ చేతిలో దేశం సురక్షితంగా ఉండదన్నారు. బీజేపీని గద్దె దింపేందుకు ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. బీజేపీపై సీఎం కేసీఆర్ పోరాటాన్ని అభినందించారు. ఇకపైనా కేంద్రంపై కొట్లాడాలని కోరారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెడ్‌పీ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగసభలో డి. రాజా మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, రూపాయి విలువ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. వర్గ, కుల రహిత సమాజం ఎర్రజెండాతోనే సాధ్యమని, దేశప్రజల ఆశ, భవిష్యత్తు ఎర్రజెండానే అని అన్నారు. తెలంగాణ నేల విప్లవాల గడ్డ అని, నిజాం రాచరికం నుంచి విముక్తికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం జరిగిందన్నారు. ఆనాటి పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రే లేదని, అయినా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి సెప్టెంబర్ 17 నుంచి విమోచన ఉత్సవాలు చేస్తామనడం విడ్డూరమని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని పారదోలుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఎంపీ అతుల్ కుమార్ అంజన్, మాజీ ఎంపీ అజీజ్ పాషా తదితరులు హాజరయ్యారు. అంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.