ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • సీపీఎం మహాధర్నా

వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బల్దియా హెడ్ ఆఫీస్  ముందు సోమవారం సీపీఎం లీడర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పేదలతో కలిసి దాదాపు 2 గంటల పాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం వల్లే సిటీలో అభివృద్ధి జరగడం లేదన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాల ద్వారా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం  రూ.246 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.300కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదన్నారు. చిన్నపాటి వానలకే కాలనీలు నీట మునుగుతున్నాయని, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. రాంపూర్ డంపింగ్ యార్డు వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కమిషనర్​కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 

ములుకనూరును మున్సిపాలిటీగా మారుస్తం: ఎమ్మెల్యే సతీశ్​ కుమార్

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలోని ములుకనూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తామని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం మండలకేంద్రంలో ఎంపీపీ జక్కుల అనిత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగగా.. చివరన ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మహిళలకు రుణాలు అందించడంలో జాతీయ స్థాయిలో రెండో స్థానం(సౌత్ రీజియన్)​లో నిలిచిన భరతమాత మండల సమాఖ్యను ప్రశంసించారు. 

సమాఖ్య అధ్యక్షురాలు, ఏపీఎంలను సత్కరించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. వంగర, రత్నగిరి, రంగయ్యపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. కొత్తకొండ నుంచి కన్నారం, వేలేరు, గట్లనర్సింగాపూర్ గ్రామాల మీదుగా డబుల్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆరు గ్రామాల్లో జీపీ భవనాల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టారు. వంగరలో 600 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ డా. సుధీర్ కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా తదితరులున్నారు.

విద్యారంగానికి పెద్దపీట

నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు:  కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే గర్ల్స్ హైస్కూల్​ను ఎమ్మెల్యే శంకర్ నాయక్​, కలెక్టర్​శశాంకలతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలన్నదే కేసీఆర్ సర్కారు లక్ష్యమన్నారు. పిల్లలు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఆర్డీవో రమేశ్, డీఎస్పీ సదయ్య, డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ రాజారమణి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్వామి, నారాయణరావు ఉన్నారు.

జాగలకు పట్టాలు ఇయ్యాలె

భీమదేవరపల్లి, వెలుగు: పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలకేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. సర్వే నెంబర్ 120లోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. 

ఇండ్లు లేని వారిని గుర్తించి, పట్టాలు అందజేయాలని కోరారు. భూపోరాటం చేస్తున్న పేదలను కొందరు అధికార పార్టీ లీడర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డులు, పెన్షన్లు పోతాయంటూ భయపెడుతున్నారని పేర్కొన్నారు. జీవో నంబర్ 58 ప్రకారం.. పేదలకు ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు, రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి మంచాల రమాదేవి తదితరులున్నారు.

ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలి: కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన

కాజీపేట, వెలుగు: ఇండ్లు కట్టుకునే పేదలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇవ్వాలని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్​నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాజీపేట చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఆ హామీని తుంగలో తొక్కాడని విమర్శించారు. 

మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు సాయం చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విలాసవంతమైన బంగ్లాలో ఉంటూ.. పేదలను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే తప్ప.. డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రం కానరావడం లేదన్నారు. వెంటనే పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రవళి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుస్, మేకల ఉపేందర్ తదితరులు ఉన్నారు.

పిల్లల్లో జోష్ నింపిన కైలాస్ సత్యర్థి
మాటా ముచ్చటకు50వేల మంది స్టూడెంట్లు హాజరు

హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ గ్రౌండ్​లో నిర్వహించిన సభకు చీఫ్ గెస్ట్ గా హాజరై స్టూడెంట్లకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన దాదాపు 50వేల మంది స్టూడెంట్లు హాజరు కాగా, ఆఫీసర్లు వారికి తగిన ఏర్పాట్లు చేశారు. 

పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సమయం, నీరు, ఆహారం వృథా చేయవద్దన్నారు. పిల్లలు సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పాలన్నారు. కార్యక్రమంలో స్టేట్‍ ప్లానింగ్‍ కమిషన్‍ వైస్‍ చైర్మన్‍ బోయినపల్లి వినోద్‍కుమార్‍, చీఫ్ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, మేయర్‍ గుండు సుధారాణి, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు రాజీవ్‍గాంధీ హనుమంతు, డాక్టర్‍ గోపి, సీపీ రంగనాథ్‍, మున్సిపల్‍ కమిషనర్‍ ప్రావీణ్య పాల్గొన్నారు.

కాకతీయుల శిల్ప కళ అద్భుతం..

కాకతీయుల శిల్పకళ అద్భుతమని కైలాస్ సత్యర్థి అన్నారు.సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను, కాకతీయుల చరిత్రను తెలుసుకున్నారు. కాకతీయుల శిల్పకళను దగ్గరుండి పరిశీలించారు.