మహారాష్ట్ర, కర్ణాటకలలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర బీజేపీదే : రాఘవులు

మహారాష్ట్ర, కర్ణాటకలలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర బీజేపీదే : రాఘవులు

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎరవేయాలని బీజేపీ ప్రయత్నించిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేనట్లుగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ పరిణామాలపై సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు చెప్పారు.

ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయొచ్చని బీజేపీ భావిస్తోందని రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ బీజేపీ చర్యలను ఖండించాలని.. ఎన్నికల ప్రతిష్ట నిలబెట్టేలా పార్టీలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గవర్నర్లు, డబ్బును వినియోగిస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు కలిసొచ్చే వారితో ఉద్యమం చేయాలని కేంద్ర కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర విధానాల వల్ల ప్రజా సమస్యలు, ధరలు పెరుగుతున్నాయని.. భవిష్యత్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఉద్యమాలకు సీపీఎం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.