క్రికెట్‌‌ను కూడా విద్వేషం వదలట్లేదు

క్రికెట్‌‌ను కూడా విద్వేషం వదలట్లేదు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌‌ కోచింగ్‌‌పై వివాదం నడుస్తోంది. ఉత్తరాఖండ్‌‌ క్రికెట్ టీమ్‌‌కు కోచ్‌‌గా ఉన్న జాఫర్.. ఆ రాష్ట్ర జట్టులో ముస్లిం ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి మతాధికారులను ఆహ్వానిస్తున్నారని జాఫర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. జాఫర్‌‌కు మద్దతుగా నిలిచిన రాహుల్.. ఇలాంటి వివాదాల వల్ల క్రికెట్‌‌కు నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘గత కొన్నేళ్లలో విద్వేషం అనేది చాలా సాధారణమైపోయింది. ఎంతగా అంటే మనందరం ఇష్టపడే క్రికెట్‌‌ను కూడా దెబ్బతీసేంతగా పెరిగిపోయింది. ఈ దేశం అందరిదీ. మన ఐక్యతను ఎవరూ దెబ్బతీయకుండా చూసుకుందాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సీరియస్ అయిన జాఫర్.. ఉత్తరాఖండ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. భారత జట్టు వెటరన్ బౌలర్లు కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్‌‌తోపాటు మనోజ్ తివారీ జాఫర్‌‌కు మద్దతుగా నిలిచారు.