అఫ్గాన్ ను ఓడించిన శ్రీలంక

అఫ్గాన్ ను ఓడించిన శ్రీలంక
  • బోణీ కొట్టిన లంక
  • అఫ్గాన్‌‌పై విజయం
  • రాణించిన కుశాల్‌‌ పెరీరా
  • సత్తా చాటిన ప్రదీప్‌‌, మలింగ

కార్డిఫ్‌‌:  వరల్డ్‌‌కప్‌‌లో మాజీ చాంపియన్‌‌ శ్రీలంక బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌‌లో న్యూజిలాండ్‌‌ చేతిలో చిత్తుగా ఓడిన లంక.. పసికూన అఫ్గానిస్థాన్‌‌పై కష్టపడి గెలిచింది. బ్యాటింగ్‌‌లో అనూహ్యంగా తడబడినా.. బౌలింగ్‌‌లో సత్తా చాటి గెలుపు రుచి చూసింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన లీగ్‌‌లో  లంక డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ పద్ధతిలో 34  పరుగుల తేడాతో అఫ్గాన్‌‌ను ఓడించింది. వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌‌లో మొదట బ్యాటింగ్‌‌కు దిగిన  శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌‌ పెరీరా (81 బంతుల్లో 8 ఫోర్లతో 78) టాప్‌‌స్కోరర్‌‌. కెప్టెన్‌‌ దిముత్‌‌ కరుణరత్నె (30), తిరిమన్నె (25) ఫర్వాలేదనిపించారు. అఫ్గాన్‌‌ బౌలర్లలో మహ్మద్‌‌ నబీ (4/30)  నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం  డక్‌‌వర్త్‌‌ పద్ధతిలో అఫ్గాన్‌‌ టార్గెట్‌‌ను 41 ఓవర్లో 187 రన్స్‌‌గా సవరించారు.  ఛేజింగ్‌‌లో అఫ్గాన్‌‌ 32.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. నజీబుల్లా జద్రాన్‌‌ (43), ఓపెనర్‌‌ హజ్రతుల్లా జజాయ్‌‌ (30),  కెప్టెన్‌‌ గుల్బదిన్‌‌ నైబ్‌‌(23) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో నువాన్‌‌ ప్రదీప్‌‌  (4/31),  లసిత్‌‌ మలింగ (3/39) ప్రత్యర్థి నడ్డివిరిచారు.

రాణించిన బౌలర్లు..

ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేజ్‌‌ చేసేందుకు బరిలోకి దిగిన అఫ్గాన్‌‌ను లంక బౌలర్లు సమష్టిగా రాణించి కట్టడి చేశారు. నిజానికి ఓపెనర్లు హజ్రతుల్లా–మహ్మద్‌‌ షెహజాద్‌‌ తొలి వికెట్‌‌కు 34  పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ,  ఐదో ఓవర్లో  షెహజాద్‌‌ను ఔట్‌‌ చేసి  మలింగ ఈ జోడీని విడదీశాడు. అనంతరం రహ్మత్‌‌ షా (2), హస్మతుల్లా షాహిది (4), నబీ (11) ఇలా వచ్చి అలా వెళ్లడంతో 57 పరుగులకే అఫ్గాన్‌‌ సగం వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్‌‌ గుల్బదిన్‌‌ నైబ్, నజీబుల్లా జద్రాన్‌‌ పోరాడి స్కోరును మూడంకెలు దాటించి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే నైబ్‌‌తోపాటు రషీద్‌‌ఖాన్‌‌(2) వెంటవెంటనే ఔట్‌‌ చేసిన ప్రదీప్‌‌ ప్రత్యర్థి ఆశలు గల్లంతు చేశాడు. మలింగ టెయిలెండర్ల పని పట్టడంతో అఫ్గాన్‌‌కు ఓటమి తప్పలేదు.

144/1 నుంచి 159/6

తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన  లంక తొలుత చెలరేగి ఆడింది. ధాటిగా ఆడిన ఓపెనర్లు కరుణరత్నె, కుశాల్‌‌ పెరీరా తొలి వికెట్‌‌కు 92 రన్స్‌‌ జోడించారు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన తిరిమన్నె (25) కూడా జోరు చూపడంతో లంక ఓదశలో 144/1తో నిలిచి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, అఫ్గాన్‌‌ స్పిన్నర్‌‌ మహ్మద్‌‌ నబీ ఒక్కసారిగా చెలరేగి ప్రత్యర్థిని వణికించాడు. ఆరు బంతుల వ్యవధిలో తిరిమన్నె (25), కుశాల్‌‌ మెండిస్‌‌ (2),  ఏంజెలో మాథ్యూస్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపి చావుదెబ్బ కొట్టాడు.  ధనంజయ డిసిల్వా (0)ను హమీద్‌‌ హసన్‌‌ ఔట్‌‌ చేయగా.. లేని పరుగు కోసం యత్నించి తిసారా పెరీరా (2) రనౌటయ్యాడు. దీంతో 15 పరుగుల వ్యవధిలో లంక ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుశాల్‌‌ పెరీరా ను రషీద్‌‌ ఖాన్‌‌ పెవిలియన్‌‌కు పంపాడు. జట్టు స్కోరు182/8 వద్ద వర్షం మ్యాచ్‌‌కు అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్‌‌ను 41 ఓవర్లకు కుదించగా లంక బ్యాట్స్‌‌మెన్‌‌ మరో 19 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌‌ ముగించారు.  లంక ఇన్నింగ్స్‌‌లో 35  పరుగులు ఎక్స్‌‌ట్రాల రూపంలో రావడం విశేషం.

స్కోర్ బోర్డ్:

శ్రీలంక: కరుణరత్నె (సి) నజిబుల్లా (బి) నబీ 30, కుశాల్‌‌ పెరీరా (సి) షహజాద్‌‌ (బి) రషీద్‌‌ 78, తిరిమన్నె (బి) నబీ 25, మెండిస్‌‌ (సి) రహ్మత్‌‌ షా (బి) నబీ 2, మాథ్యూస్‌‌ (సి) మాథ్యూస్ (బి) నబీ 0, డిసిల్వ (సి) షహజాద్‌‌ (బి) హమిద్‌‌ హసన్‌‌ 0, తిసార పెరీరా (రనౌట్‌‌) 2, ఉదాన (బి) దౌలత్‌‌ 10, లక్మల్‌‌ (నాటౌట్) 15, మలింగ (బి) దౌలత్‌‌ 4, ప్రదీప్‌‌(బి) రషీద్‌‌ 0; ఎక్స్‌‌ట్రాలు: 35; మొత్తం: 36.5 ఓవర్లలో 201 ఆలౌట్‌‌; వికెట్ల పతనం: 1–92, 2–144, 3–146, 4–146,5–149, 6–159, 7–178, 8–180, 9–199; బౌలింగ్‌‌: దౌలత్‌‌ 6–0–34–2, హమిద్‌‌ హసన్‌‌ 7–0–53–1, ముజీబుర్‌‌ 3–0–19–0, నబీ 9–0–30–4, గుల్బదిన్‌‌ 4–0–38–0, రషీద్‌‌ 7.5–1–17–2.

అఫ్గానిస్థాన్‌‌ ( టార్గెట్​187)  : షెహజాద్‌‌ (సి) కరుణరత్నె (బి) మలింగ 7, జజాయ్‌‌ (సి) తిశార పెరీరా (బి) ప్రదీప్‌‌ 30, రహ్మత్‌‌ షా (సి) మాథ్యూస్‌‌ (బి) ఉదాన 2, హష్మతుల్లా (సి)కుశాల్‌‌ పెరీరా(బి) ప్రదీప్‌‌ 4, నబీ (బి) తిశారా పెరీరా 11, నైబ్‌‌ (ఎల్బీ)(బి) ప్రదీప్‌‌ 23, నజీబుల్లా (రనాట్‌‌) 43, రషీద్‌‌ ఖాన్‌‌ (బి) ప్రదీప్‌‌ 2, దౌలత్‌‌(బి) మలింగ 6, హమిద్‌‌ (బి) మలింగ 6, ముజీబ్‌‌ (నాటౌట్‌‌) 1; ఎక్స్‌‌ట్రాలు : 17 ; మొత్తం : 32.4 ఓవర్లలో 152 ఆలౌట్‌‌ ; వికెట్ల పతనం : 1–34, 2–42, 3–44, 4–57, 5–57, 6–121, 7–123, 8–136, 9–145, 10–152 ; బౌలింగ్‌‌ :  మలింగ 6.4–0–39–3, లక్మల్‌‌ 6–0–27–0, ఉదాన 6–0–28–1, ప్రదీప్‌‌ 9–1–31–4, తిశార పెరీరా 4–0–19–1, డిసిల్వా 1–0–7–0.