మహా సంగ్రామం : నేటి నుంచి వన్డే వరల్డ్ కప్

మహా సంగ్రామం : నేటి నుంచి వన్డే వరల్డ్ కప్

పురిటి గడ్డపై తన 12వ పుట్టిన రోజు జరుపుకోవడానికి సిద్ధమైన వన్డే వరల్డ్కప్ నేటి నుంచే..!

 బరిలో 10 జట్లు..ఫేవరెట్లుగా ​ఇండియా, ఇంగ్లండ్​, ఆస్ట్రేలియా​.. మూడో కప్​పై టీమిండియా గురి

బ్లాక్​ అండ్​ వైట్​ కాలం నుంచి.. స్మార్ట్​ ఫోన్​ యుగం వరకు.. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. మధురానుభూతులను మదిలో నింపుతూ.. క్రికెట్​ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ‘ప్రపంచకప్​’ మరోసారి మన ముందుకొచ్చింది. అప్పుడెప్పుడో ప్రఖ్యాత లార్డ్స్​లో మొదలైన పయనం.. ఏరులా పారుతూ.. ప్రవాహాంలా పెరుగుతూ.. నదిలా విస్తరిస్తూ…  సముద్రంలా నిలుస్తూ..  ప్రపంచాన్ని చుట్టేసింది. ఓ మతంగా మారుతూ.. దేవుళ్లను సృష్టించింది. దేశాలను ఏకం చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ.. కొత్త హంగులతో సరికొత్త రంగులతో రసవత్తర పోటీతో మళ్లీ సిద్ధమైంది. ఆటగాళ్లు మారినా.. వేదికలు మారినా.. విజేతలు మారినా.. వన్నె తగ్గని కోహినూర్​లా మెరుస్తూనే ఉంది. కాలగమనంలో పాత చరిత్ర మసకబారిపోతున్నా.. ఏటికేడు కొత్త సంచలనాలతో భవిష్యత్​ కూడా బంగారుమయంగానే కనిపిస్తోంది. ఓవరాల్​గా రాబోయే నెలన్నర రోజులు ‘వరల్డ్​కప్పాయా నమా:’ అనే నామస్మరణతో ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఇదీ చరిత్ర..

1971లో వన్డే క్రికెట్‌‌ మొదలైన నాలుగేళ్ల తర్వాత అంటే 1975లో తొలిసారి ప్రపంచకప్‌‌నకు బీజం పడింది.  ఇంగ్లండ్‌‌లో రౌండ్‌‌ రాబిన్‌‌, నాకౌట్‌‌ పద్ధతిలో 8 జట్లతో తొలి టోర్నీ నిర్వహించారు. ఇక అప్పట్నించి క్రమం తప్పకుండా ప్రపంచంలోని మేటీ జట్లతో ఈ టోర్నీని ఏర్పాటు చేస్తున్నారు. ఏటికేడాది కొత్త రూపు సంతరించుకుంటూ వస్తున్న టోర్నీకి ఈ సారి మరిన్ని మేళవింపులను అద్దారు.  ఇప్పటి వరకు  1975 నుంచి 2015 వరకు 11 సార్లు టోర్నమెంట్‌‌ను నిర్వహిస్తే.. ఐదు జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. వెస్టిండీస్‌‌ ఆధిపత్యానికి గండికొడుతూ… మధ్యలో చిన్న జట్లు పెద్ద చరిత్రను సృష్టించినా.., గత కొంత కాలంగా మాత్రం ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఇప్పటివరకు ఐదుసార్లు కంగారూలు కప్‌‌ను ముద్దాడితే.. రెండుసార్లు విండీస్‌‌, ఇండియా, ఒక్కోసారి శ్రీలంక, పాకిస్థాన్‌‌ ఆ ముచ్చట తీర్చుకున్నాయి.  అయితే క్రికెట్‌‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌‌ ఒక్కసారి కూడా కప్‌‌ గెలువకపోవడం శోచనీయం.

2011, 2015 టోర్నీల్లో 14 జట్లు బరిలోకి దిగితే ఇప్పుడు జరగబోయే టోర్నీలో 10 టీమ్‌‌లు మాత్రమే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఐసీసీ వన్డే చాంపియన్‌‌షిప్‌‌లో టాప్–8 జట్లు ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌‌, ఇండియా, న్యూజిలాండ్‌‌, పాకిస్థాన్‌‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక నేరుగా వరల్డ్‌‌కప్‌‌కు అర్హత సాధించగా, అఫ్ఘానిస్థాన్‌‌, వెస్టిండీస్‌‌ క్వాలిఫయింగ్‌‌ టోర్నీ ద్వారా అడుగుపెట్టాయి.  ఈనెల 30న మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌‌ జూలై 14న ప్రఖ్యాత లార్డ్స్‌‌లో జరిగే ఫైనల్‌‌తో ముగుస్తుంది.  మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఈ సారి టోర్నీ రౌండ్‌‌ రాబిన్‌‌ పద్ధతిలో ముస్తాబవుతోంది. గతంలో అసోసియేట్‌‌, అఫిలియేషన్‌‌ దేశాలకు కచ్చితంగా నాలుగు బెర్త్‌‌లను కేటాయించిన ఐసీసీ ఈసారి ఆ జట్లు లేకుండానే టోర్నీని నిర్వహిస్తున్నది. 1983, 2011లో విజేతగా నిలిచిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి కప్‌‌ను దక్కించుకోవాలని చూస్తుండగా, ఆసీస్‌‌ ఆధిపత్యం నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉన్నది.  కాలాన్ని మరోసారి వెనక్కి తీసుకెళ్లి పాత కథను పునరావృతం చేయాలని కరీబియన్లు పట్టుదలగా ఉంటే.. తొలిసారి కప్‌‌ను ముద్దాడాలని న్యూజిలాండ్‌‌, దక్షిణాఫ్రికా కలలు కంటున్నాయి. ప్రతి జట్టులో స్టార్‌‌ ఆటగాళ్లకు కొదవలేదు కాబట్టి.. రసవత్తర పోరాటాలు.. అంతకుమించిన ఆవేశాలు.. భావోద్వేగాల మేళవింపుతో ‘ది గ్రేట్‌‌’ నాక్‌‌ కొట్టేదెవరో?

తొలి దెబ్బ ఎవరిదో!

లండన్‌‌: సొంతగడ్డపై  సత్తా చాటి ఎలాగైనా వరల్డ్‌‌కప్‌‌ అందుకోవాలన్న ఆశతో నాలుగేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్న  ఇంగ్లండ్‌‌ అందుకు తొలి అడుగు వేసేందుకు రెడీ అయింది. తనలాగే తొలి కప్పుకోసం ఎన్నో ఏళ్లుగా తపిస్తున్న సౌతాఫ్రికాతో గురువారం ఇక్కడి ఓవల్‌‌ మైదానంలో జరిగే వరల్డ్‌‌కప్‌‌ ఆరంభం మ్యాచ్‌‌లో ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. గత వరల్డ్‌‌కప్‌‌లో తొలి రౌండ్‌‌లోనే ఓడి అవమానకర రీతిలో  నిష్క్రమించిన తర్వాత  ఇంగ్లండ్‌‌ పునరాలోచనలో పడింది.  ఈ ఫార్మాట్‌‌లో తన ఆటనే కాకుండా యాటిట్యూడ్​ను కూడా మార్చుకుంది. ఫలితంగా ఇయాన్‌‌ మోర్గాన్‌‌ కెప్టెన్సీలో టీమ్‌‌ వన్డేల్లో టాప్‌‌ ర్యాంక్‌‌కు చేరుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌‌లో పవర్‌‌ఫుల్‌‌ టీమ్‌‌గా ఎదిగి  రెండుసార్లు వరల్డ్‌‌ బెస్ట్‌‌ స్కోర్లు నమోదు చేసింది. ప్రస్తుత హైస్కోరు 481/6 ఆ జట్టు పేరు మీదనే ఉంది. జేసన్‌‌ రాయ్‌‌, జానీ బెయిర్‌‌స్టో, జో రూట్‌‌, మోర్గాన్‌‌, బట్లర్‌‌ వంటి మ్యాచ్‌‌ విన్నర్లతో ఆ జట్టు బ్యాటింగ్‌‌  టోర్నీలోనే అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది.

ఆల్‌‌రౌండర్లు బెన్‌‌ స్టోక్స్‌‌, మొయిన్‌‌ అలీ, క్రిస్‌‌ వోక్స్‌‌, జోఫ్రా ఆర్చర్‌‌లతో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని శక్తిగా మారి ప్రత్యర్థులకు సవాల్‌‌ విసిరేందుకు సిద్ధమైంది. నాలుగేళ్ల ప్లాన్స్‌‌ను అమలు చేసేందుకు సమరోత్సాహంతో మైదానంలోకి దిగబోతోంది. మరోవైపు నాలుగు సార్లు సెమీస్‌‌లోనే ఓడిన సౌతాఫ్రికా ఈ సారి తన రాత మార్చుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌, డికాక్‌‌, ఆమ్లా, మిల్లర్‌‌, డుమిని… బౌలింగ్‌‌లో రబాడ, ఎంగిడి, తాహిర్‌‌, ఆల్‌‌రౌండర్లు ఫెలుక్వాయో, క్రిస్‌‌ మోరిస్‌‌తో సఫారీలు కూడా ఇంగ్లండ్‌‌కు సమఉజ్జీలుగా ఉన్నారు. పైగా, గత ఐదు మ్యాచ్‌‌ల్లోనూ ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. గాయం కారణంగా సీనియర్‌‌ పేసర్‌‌ డేల్‌‌ స్టెయిన్‌‌  ఈ మ్యాచ్‌‌కు దూరమైనా జట్టు బలంగానే కనిపిస్తోంది. మరి, సమఉజ్జీల పోరులో ఎవరిది పైచేయి అవుతుందో.. వరల్డ్‌‌కప్‌‌లో తొలి విజయం ఎవరిదో చూడాలి.