బెంగాల్ లో బీజేపీ ఆటలు సాగవు

బెంగాల్ లో బీజేపీ ఆటలు సాగవు

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ కమలం పేరిట వరుసగా బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలను ఎన్‌డిఎ కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అనంతరం బీజేపీ ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుంటుందన్న వార్తలపై ఆమె స్పందించారు. తమతో పెట్టుకున్న వారెవ్వరూ గెలిచిన దాఖలాల్లేవని.... మరాఠా తర్వాత చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అంటున్నరు. కానీ ఇప్పటికే ఇక్కడ మకాం వేసేందుకు చాలా ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారని తెలిపారు. అయితే ఇక్కడికి రావాలంటే బంగాళాఖాతం దాటాలని దీదీ కామెంట్స్ చేశారు. వచ్చే క్రమంలో అక్కడ ఉన్న మొసళ్లు మిమ్మల్ని కొరికేస్తాయి, జర జాగ్రత్త అని హెచ్చరించారు. సుందర్ బన్స్ లో రాయల్ బెంగాల్ టైగర్ మీ కోసం రెడీగా ఉందని, అది మీ ప్రాణాలు తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఉత్తర బెంగాల్ లో ఉన్న ఏనుగులు కూడా మీ వైపుగా దూసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు ఎందుకు తీసుకెళ్లారంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. దేశంలోనే నెంబర్ వన్ హాస్పిటల్ గా చెప్పుకునే SSKM కి ఎందుకు తీసుకెళ్ళారు? అంటూ మండిపడ్డారు. ESI హాస్పిటల్ ఎందుకు? కమాండ్ హాస్పిటల్ ఎందుకు? ఉద్దేశం ఏమిటి? ? ఇది బెంగాల్ ప్రజలను అవమానించడం కాదా? మీరు ఏమనుకుంటున్నారు? రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను దొంగల్లా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల కారణంగానే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారని మండిపడ్డారు. అవినీతికి, అక్రమానికి తాము మద్దతు ఇవ్వడం లేదన్న ఆమె.. ఏజెన్సీలను ఉపయోగించి తన పార్టీని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారని తెలిపారు. తొందర్లోనే నిజం బయటకు వస్తుందని స్పష్టం వస్తుందని దీదీ స్పష్టం చేశారు. తాను ఎవరినీ విడిచిపెట్టనని, దొంగలను, దోపిడీదారులను TMC వారిని విడిచిపెట్టదని మమతా బెనర్జీ తెలిపారు. ఆ విషయానికొస్తే తాను స్వంత వ్యక్తులను కూడా అరెస్టు చేపించామని.... మా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.