భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంటలు పండించాలో భూసార పరీక్షల ద్వారా ప్రభుత్వం రైతులకు తెలియజేయాలి.  మట్టి స్వభావం, రసాయన ఎరువుల వాడకం లాంటి విషయాలపై అన్నదాతలకు పూర్తి అవగాహన కల్పిస్తే పంటల్లో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ  కీలకమైన వ్యవసాయ రంగంపై గవర్నమెంట్ నిర్లక్ష్యం చూపుతోంది.  ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది.  అయినా ఇప్పటివరకు భూసార పరీక్షలు చేయించడంపై కనీసం దృష్టి సారించడం లేదు. 

మూడేళ్ల కింద భూసార పరీక్షలు 

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో సారం తక్కువ ఉంది. కొన్ని చోట్ల చౌడు నేలలు కూడా ఉన్నాయి. భూసారం పెరిగితే పంటలు సాగు చేసే రైతులకు దిగుబడి, ఆదాయం సమకూరుతుంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. 2020 లో భూసార పరీక్షలు చేసిన అధికారులు తర్వాత నిలిపివేశారు. ఫలితంగా రైతులు ఏ పంటలు పండించాలో తెలియక భూముల్లో దిగుబడి తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. 

నష్టపోతున్న రైతులు...

రైతు ప్రయోజనాలు, సాగు భూమి మనుగడ కాపాడేందుకు సర్కార్ ఉచితంగా భూసార పరీక్షలు చేయించేది.  జిల్లాలో 4.13 లక్షల ఎకరాల్లో భూ విస్తీర్ణం ఉండగా సుమారు లక్ష మంది రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు.  పత్తి పంట, ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 

 ఏప్రిల్, మే నెలలోనే భూములు ఖాళీగా ఉంటాయి.  ఆ సమయంలో భూసార పరీక్షలు చేసేవారు.  రైతుల పొలాల్లో నుంచి మట్టి  నమూనాలు సేకరించి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి పంపేవారు.  వాటిని పరీక్షించి భూసారం ఏ మేరకు ఉంది.  పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఏయే పంటలు సాగు చేయవచ్చనే వివరాలతో రైతులకు ప్రత్యేక కార్డులు ఇచ్చేవారు.  కానీ జిల్లాలో మూడేళ్ల నుంచి ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.  ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.భూసారం గురించి తెలియకపోవడంతో ఏ పంటలు, వాటికి ఏయే ఎరువులు ఏ మోతాదులో వేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.

నిరుపయోగంగా రైతు వేదికలు 

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రూ. లక్షలు వెచ్చించి ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు వేదిక నిర్మాణాలు చేపట్టింది.  భూసార పరీక్షల కిట్లు అందజేసింది. ఏఈఓ లను అందుబాటులో ఉంచింది.  వంద చొప్పున కిట్లను పంపిణీ చేసిన గవర్నమెంట్ రసాయనాల  సరఫరా మాత్రం  మూడేళ్ల నుంచి చేయడం లేదు. దీంతో రైతు వేదికల్లో భూ సార పరీక్షల కిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
మట్టి టెస్ట్ చేస్తలేరు
మా చేన్లో గత మూడేళ్లుగా పంట దిగ్గుబడి తగ్గింది. ఎరువులు ఎంత వాడిన ప్రయోజనం లేదు. మట్టి పరీక్షలు చేస్తలేరు. కారణం తెలుస్తలేదు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
 --  మాడవి మాన్నుకు, రైతు, జైనూర్

మట్టి పరీక్షలు చేయాలి

మూడేళ్ల నుంచి  వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేయడం లేదు.  ఏ భూమిలో ఎలాంటి పంటలు, ఎరువులు వేయాలో మాకు తెలియడం లేదు.  పంట దిగ్గుబడి తగ్గిపోతుంది.  మట్టి పరీక్షలు చేసి కారణాలు గుర్తించాలి.  సాగు పై అవగాహన కల్పించి సూచనలివ్వాలి.

 - కొట్నాక్ తిరుపతి ,రైతు

 సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

భూసార పరీక్షలు చేయాలని గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలే. గత మూడేళ్ల నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో బంద్ ఉంది.  ఏప్రిల్ నెలలో భూసార పరీక్షలు చేసి ఏయే భూముల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలో, ఏయే ఎరువులు కావాలో  మే నెలలో రైతులకు చెప్పేవాళ్లం. మూడేళ్లుగా భూసార పరీక్షలు చేయడం లేదు. గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.  - శ్రీనివాస్, ఏడీఏ