
- కొనుగోళ్లు స్పీడప్ చేసి వడ్లను వెంటనే తరలించాలి
- కలెక్టర్లకు సీఎస్రామకృష్ణారావు ఆదేశం
- నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌లను రంగంలోకి దించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ముందస్తు వర్షాల వల్ల కొనుగోలుకేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు వడ్లను వెంటనే తరలించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ధాన్యం, పత్తి కొనుగోలు, పంటనష్టం నివారణ, ఇతర వ్యవసాయ కార్యకలాపాలపై సమీక్షించారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ కలెక్టర్లకు వివరించారు. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తర్వాత 15 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాష్ట్రంలో సరిపడా డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సీఎస్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల ముప్పును అరికట్టేందుకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయం, సరఫరాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో తెరచి ఉన్న నాలాలు, మ్యాన్‌హోల్స్ మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ఫైర్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.