నా సర్వీసులో ఇంత అభివృద్ధి చూడలే: సీఎస్​ శాంతి కుమారి

నా సర్వీసులో ఇంత అభివృద్ధి చూడలే: సీఎస్​ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: తన 34 ఏండ్ల సర్వీసులో రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చూడలేదని సీఎస్ శాంతికుమారి అన్నారు. తొమ్మిదేండ్లల్లో తెలంగాణ చా లా డెవలప్ అయ్యిందని పేర్కొన్నారు.  దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని తెలంగాణ సాధించిందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆమె ఎంసీఆర్ హెచ్చార్డీ నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ ప్రోగ్రామ్​లో పాల్గొని మాట్లాడారు. నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, హెల్త్​, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని  సీఎస్ శాంతి కుమారి తెలిపారు. సీఎం కేసీఆర్​వల్లే ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పారు. 2014కు ముందు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో  వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలియజేశారు. వేసవి కాలం వచ్చిందంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ లు రూపొందించే విధానం ఉండేదని, ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయిందని వెల్లడించారు. ప్రతి ఉద్యోగి అంకిత భావమే దీనికి కారణమని ప్రశంసించారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ సీసీఎఫ్ డోబ్రియల్​ తదితరులు పాల్గొన్నారు.