ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి

చెన్నై చేజేతులా

వాట్సన్‌‌ పోరాటం వృథా

10 రన్స్‌‌తో కోల్‌‌కతా అనూహ్య విజయం

అదరగొట్టిన రాహుల్‌‌ త్రిపాఠి

చెన్నై టార్గెట్‌‌ 168. షేన్‌‌ వాట్సన్‌‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 50), అంబటి రాయుడు   (27 బంతుల్లో 3 ఫోర్లతో 30) బలమైన పునాది వేయడంతో ఫస్ట్ పది ఓవర్లలోనే 90 రన్స్‌‌ వచ్చేశాయి. మరో 60 బంతుల్లో 78  పరుగులు కావాలి. చేతిలో 9 వికెట్లున్నాయి. జట్టులో అందరూ హిట్టర్లే. ఇంకేం మరో ఐదారు ఓవర్లలో చెన్నై గెలుపు లాంఛనమే అనిపించింది. కోల్‌‌కతాకు మరో ఓటమి తప్పదని అంతా ఫిక్సయ్యారు. కానీ, ఈ టైమ్‌‌లో నైట్‌‌ రైడర్స్‌‌ టీమ్​ మాయ చేసింది. అత్యద్భుత బౌలింగ్‌‌తో  చెన్నైకి చెక్‌‌ పెట్టింది. బంతి బంతికి పరీక్ష పెడుతూ చివరి పది ఓవర్లలో 67  పరుగులే ఇచ్చి అనూహ్య విజయం సాధించింది. దాంతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌‌ ను చెన్నై చేజేతులా వదులుకుంది. ఓవర్‌‌కో 13 రన్స్‌‌ చేయాల్సిన సిచ్యువేషన్‌‌లో 12 బాల్స్‌‌లో 7 పరుగులే చేసిన కేదార్‌‌ జాదవ్‌‌ విలన్‌‌గా మారాడు.  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఎనిమిదో నంబర్‌‌లో ఆడి ఈ సారి ఓపెనర్‌‌గా వచ్చిన కోల్‌‌కతా యంగ్‌‌ స్టర్‌‌ రాహుల్‌‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌తో హీరో అయ్యాడు.

అబుదాబి: కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ అద్భుతం చేసింది.  ఢిల్లీతో గత మ్యాచ్‌‌లో భారీ టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేయలేకపోయిన ఆ జట్టు ఈసారి చిన్న టార్గెట్‌‌ను కాపాడుకోవడంలో సక్సెస్‌‌ అయింది.  బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన కేకేఆర్‌‌ 20 ఓవర్లలో 167 రన్స్‌‌కు ఆలౌటైంది. బర్త్‌‌డే బాయ్‌‌ డ్వేన్‌‌ బ్రావో (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఓవర్లన్నీ ఆడిన సీఎస్‌‌కే 5 వికెట్లకు 157 పరుగులే చేసి ఓడిపోయింది.  రాహుల్‌‌ త్రిపాఠికి మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

త్రిపాఠి ఫటాఫట్‌‌       

ఫైనల్ ఎలెవన్‌‌లో ఒక్క మార్పు లేకుండా బరిలోకి దిగిన కోల్‌‌కతా కొన్ని ప్లాన్స్‌‌ మాత్రం మార్చుకుంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఎనిమిదో నెంబర్‌‌లో దింపిన రాహుల్‌‌ త్రిపాఠిని ఈ సారి ఓపెనర్‌‌గా పంపి సక్సెస్‌‌ అయింది. ఈ చాన్స్‌‌ను త్రిపాఠి చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. క్లాసిక్‌‌ షాట్లతో గ్రౌండ్‌‌ నలుమూలలా బౌండ్రీలు రాబట్టి గొప్ప ఇన్నింగ్స్‌‌తో అలరించాడు.  మరో యంగ్‌‌స్టర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (11)తో కలిసి ఫస్ట్‌‌ వికెట్‌‌కు 37 రన్స్‌‌ జోడించిన  త్రిపాఠి  మంచి ఆరంభం అందించాడు. ఫస్ట్‌‌ బాల్‌‌నే బౌండ్రీకి పంపిన అతను దీపక్‌‌ చహర్‌‌ (0/47), సామ్‌‌ కరన్‌‌ (2/26) బౌలింగ్‌‌లో రెండేసి ఫోర్లతో జోరు చూపాడు. శార్దూల్‌‌  (2/28)వేసిన ఐదో ఓవర్లో కీపర్‌‌ ధోనీకి క్యాచ్‌‌ ఇచ్చిన గిల్‌‌ వెనుదిరిగినా అతను మాత్రం వెనక్కు తగ్గకపోవడంతో పవర్‌‌ ప్లేలో కేకేఆర్‌‌ 52 రన్స్‌‌ చేసింది.  వన్‌‌ డౌన్‌‌లో వచ్చిన నితీశ్​ రాణా (9) బౌండ్రీతో ఖాతా తెరిచినా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. తొమ్మిదో ఓవర్లో  కర్ణ్‌‌ శర్మ (2/25) ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌కు స్లాగ్‌‌ స్వీప్‌‌ షాట్‌‌ ఆడి లాంగాన్‌‌లో జడేజాకు ఈజీ క్యాచ్‌‌ ఇచ్చాడు. బ్రావో  బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టిన త్రిపాఠి 31 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. నరైన్‌‌ (17) 6, 4 బాదాడు. దాంతో, ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్లలో కోల్‌‌కతా 92/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లో జడేజా, డుప్లెసిస్‌‌ కలిసి అందుకున్న సూపర్‌‌ క్యాచ్‌‌కు నరైన్‌‌ పెవిలియన్‌‌ చేరాడు.  ఇక, క్రీజులో ఇబ్బందిగా కనిపించిన ఇయాన్‌‌ మోర్గాన్‌‌ (7).. తన ఇంగ్లండ్‌‌ టీమ్‌‌మేట్‌‌ కరన్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌ ధోనీకి క్యాచ్‌‌ ఇచ్చి నాలుగో వికెట్‌‌గా వెనుదిరిగాడు. అప్పటికి కేకేఆర్‌‌ స్కోరు 14 ఓవర్లలో 114/4.  చహర్‌‌ బౌలింగ్‌‌ 4, 6 బాదిన రాహుల్‌‌ ఇన్నింగ్స్‌‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్లో డేంజర్‌‌ మ్యాన్​ రసెల్‌‌ (2)ను కాట్‌‌ బిహైండ్‌‌ చేసిన శార్దూల్‌‌ కోల్‌‌కతాను దెబ్బకొట్టాడు. అయితే త్రిపాఠి జోరు చూస్తుంటే అతను సెంచరీ చేయడంతో పాటు జట్టు 180 రన్స్‌‌ చేసేలా కనిపించింది. కానీ, బ్రావో వేసిన 17వ ఓవర్లో థర్డ్‌‌ మ్యాన్‌‌లో వాట్సన్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో అతని ఇన్నింగ్స్‌‌కు తెరపడింది. ఈ టైమ్‌‌లో పాట్‌‌  కమిన్స్‌‌ (17 నాటౌట్‌‌) ఓ ఫోర్‌‌, సిక్సర్‌‌ కొట్టినా కెప్టెన్‌‌ కార్తీక్‌‌ (12) నిరాశ పరిచాడు.  బ్రావో వేసిన లాస్ట్‌‌ ఓవర్లో  నాగర్‌‌ కోటి (0), శివం మావి (0), వరుణ్‌‌ చక్రవర్తి (1) ఔటవగా ఐదే పరుగులే వచ్చాయి. ఓవరాల్‌‌గా 16 నుంచి 20 ఓవర్లలో కేకేఆర్‌‌ 34 పరుగులే చేసి మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

వాట్సన్‌‌ ధనాధన్​

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ను చెన్నై ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు వాట్సన్‌‌, డుప్లెసిస్‌‌ (10 బంతుల్లో 17) ఫస్ట్‌‌ వికెట్‌‌కు 30 రన్స్‌‌ జోడించారు. మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన డుప్లెసిస్‌‌ను నాలుగో ఓవర్లో కాట్‌‌ బిహైండ్‌‌ చేసిన మావి (1/32 ) కేకేఆర్‌‌కు ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. అయితే, వాట్సన్‌‌ ఫామ్‌‌ కొనసాగించాడు. మావి బౌలింగ్‌‌లోనే 4, 6 కొట్టిన అతను క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టాడు. మరో ఎండ్‌‌లో రాయుడు  కూడా దూకుడుగా ఆడడంతో పవర్‌‌ ప్లేలోనే 54 రన్స్‌‌ వచ్చాయి. ఫీల్డ్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ మారిన తర్వాత కూడా షేన్‌‌, రాయుడు అదే జోరు కొనసాగించారు. ఇద్దరూ క్రీజు ముందుకొచ్చి స్వేచ్ఛగా షాట్లు ఆడారు. స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి (1/28), యంగ్‌‌ పేసర్‌‌ నాగర్‌‌కోటి (1/21)ని దినేశ్​ బరిలోకి దింపినా ఏ మాత్రం స్పీడు తగ్గకుండా ఓవర్‌‌కో బౌండ్రీ సాధించారు. ఇక, వాట్సన్​ ఇచ్చిన రెండు క్యాచ్‌‌లను కోల్‌‌కతా ఫీల్డర్లు మిస్‌‌ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆసీస్‌‌ వెటరన్‌‌ మరింత రెచ్చిపోవడంతో పది ఓవర్లకు చెన్నై 90/1తో నిలిచింది.

సీన్​ రివర్స్​

11వ ఓవర్​ నుంచి సీన్​ రివర్స్​ అయింది. ఫస్ట్‌‌ టెన్‌‌లో తేలిపోయిన కేకేఆర్‌‌ బౌలర్లు తర్వాత గొప్పగా  పుంజుకున్నారు. వరుస ఓవర్లలో అంబటి, వాట్సన్‌‌ను ఔట్‌‌ చేసి రేసులోకి వచ్చారు. నాగర్‌‌కోటి బౌలింగ్‌‌లో రాయుడు లాంగాన్‌‌లో గిల్‌‌కు చిక్కగా, ఫిఫ్టీ దాటిన వెంటనే వాట్సన్‌‌.. నరైన్‌‌ (1/31)కు వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాతి ఐదు ఓవర్లలో 20 పరుగులే రాగా ధోనీ (12 బంతుల్లో 1 ఫోర్‌‌తో 11), సామ్‌‌ కరన్‌‌ (11 బంతుల్లో 1 ఫోర్‌‌, 1 సిక్సర్‌‌తో 17) ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేదు. దాంతో, చెన్నైపై ఒత్తిడి పెరిగింది. అయితే, నరైన్‌‌ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన కరన్‌‌ ప్రెజర్‌‌ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే చక్రవర్తి బౌలింగ్‌‌లో ఫోర్‌‌ బాదిన ధోనీ తర్వాతి బాల్‌‌కే భారీ షాట్‌‌ కొట్టబోయి బౌల్డ్‌‌ అవడంతో చెన్నై డీలా పడింది. ఆ ఓవర్‌‌ చివరి మూడు బాల్స్‌‌లో కేదార్‌‌ జాదవ్‌‌  ఒక్క పరుగు కూడా చేయలేదు. దాంతో చివరి 18 బాల్స్‌‌లో 39 రన్స్‌‌ అవసరం అవగా.. ఇరు జట్లకూ సమాన అవకాశాలు కనిపించాయి. కానీ, రసెల్‌‌ వేసిన 18వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే కరన్‌‌ ఔటవగా.. మిగతా ఐదు బాల్స్‌‌లో కేదార్‌‌, జడేజా (8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 21 నాటౌట్‌‌) మూడు పరుగులే రాబట్టారు. దాంతో సమీకరణం 12 బాల్స్‌‌లో 36గా మారింది. 19వ ఓవర్లో నరైన్‌‌ 10 పరుగులే ఇచ్చాడు. దాంతో చెన్నై విజయానికి లాస్ట్‌‌ ఓవర్లో 26 రన్స్‌‌ అవసరం కాగా.. కనీసం షాట్‌‌ కొట్టేందుకు కూడా ప్రయత్నించలేకపోయిన కేదార్‌‌ ఫస్ట్‌‌ మూడు బాల్స్‌‌లోఒక్క పరుగే తీయడంతో కేకేఆర్‌‌ విజయం ఖాయమైంది. తర్వాతి మూడు బాల్స్‌‌కు జడ్డూ 6,4,4 కొట్టినా అవి చెన్నై ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.

కోల్‌‌కతా: త్రిపాఠి (సి) వాట్సన్‌‌ (బి) బ్రావో 81, గిల్‌‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌‌ 11, రాణా (సి) జడేజా (బి) కర్ణ్‌‌ శర్మ 9, నరైన్ (సి) డుప్లెసిస్‌‌ (బి) కర్ణ్‌‌ శర్మ 17, మోర్గాన్‌‌ (సి) ధోనీ (బి) కరన్‌‌ 7, రసెల్‌‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌‌  2, కార్తీక్‌‌ (సి) శార్దూల్‌‌ (బి) కరన్‌‌ 12, కమిన్స్‌‌ (నాటౌట్‌‌) 17, నాగర్‌‌కోటి (సి) డుప్లెసిస్‌‌ (బి) బ్రావో 0, మావి (సి) ధోనీ (బి) బ్రావో 0, చక్రవర్తి (రనౌట్‌‌) 1; ఎక్స్‌‌ట్రాలు: 10;  మొత్తం: 20 ఓవర్లలో 167 ఆలౌట్‌‌; వికెట్ల పతనం: 1–37, 2–70, 3–98, 4–114, 5–128 , 6–140, 7–162, 8–163, 9–166, 10–167; బౌలింగ్‌‌: చహర్‌‌ 4–0–47–0, కరన్‌‌ 4–0–26–2, శార్దూల్‌‌ 4–0–28–2, కర్ణ్‌‌ శర్మ 4–0–25–2, బ్రావో 4–0–37–3.

చెన్నై:  వాట్సన్‌‌‌‌ (ఎల్బీ) నరైన్‌‌‌‌ 50, డుప్లెసిస్‌‌‌‌ (సి) కార్తీక్‌‌‌‌ (బి) శివమ్​ మావి 17, రాయుడు (సి) గిల్‌‌‌‌ (బి) నాగర్‌‌‌‌కోటి 30, ధోనీ(బి) చక్రవర్తి  11,  సామ్​కరన్‌‌‌‌ (సి) మోర్గాన్‌‌‌‌ (బి) రసెల్‌‌‌‌ 17,  కేదార్‌‌‌‌(నాటౌట్‌‌‌‌) 7, జడేజా (నాటౌట్‌‌‌‌) 21 ; ఎక్స్‌‌‌‌ట్రాలు: 4 ; మొత్తం 20 ఓవర్లలో 157/5 ; వికెట్ల పతనం: 1–30, 2–99, 3–101, 4–129, 5–129 ;  బౌలింగ్‌‌‌‌: కమిన్స్‌‌‌‌ 4–0–25–0, మావి 3–0–32–1, చక్రవర్తి 4–0–28–1, నాగర్‌‌‌‌కోటి 3–0–21–1, నరైన్‌‌‌‌ 4–0–31–1, రసెల్‌‌‌‌ 2–0–18–1.