ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ సున్నా.. 20 గంటలు కరెంట్ కోతలు.. జనం అల్లాడిపోతున్నారు..!

ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ సున్నా.. 20 గంటలు కరెంట్ కోతలు.. జనం అల్లాడిపోతున్నారు..!

హవానా: ఇంధన నిల్వలు సున్నా.. రోజుకు 20 గంటలు కరెంట్ కోతలు.. బయటకు వెళ్దామంటే పెట్రోల్, డీజిల్ లేక బండ్లు, కార్లు తీయాలనే దుస్థితి. ఇంట్లో ఉందామంటే కరెంట్ లేక నరకయాతన. ఓ వైపు ఇంధనం దొరకక.. మరోవైపు కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. ఇది ప్రస్తుతం కమ్యూనిస్ట్ కంట్రీ క్యూబా ప్రజల పరిస్థితి. క్యూబాలో ఇంధన నిల్వలు జీరో స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో జనానికి పెట్రోల్, డీజిల్ చుక్క దొరకని పరిస్థితి. మరోవైపు 20 గంటల పాటు పవర్ కట్. 

ఆసుపత్రులు తీవ్రమైన పరిమితుల మధ్య పనిచేస్తుండగా.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఈ ప్రభావం పర్యాటక రంగంపైన తీవ్రంగా దెబ్బతింది. ఈ అరిగోస భరించలేక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే బుధవారం (మే 13) దేశ రాజధాని హహనాలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. చమురు, కరెంట్ సంక్షోభంపై ఆ దేశ ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ.. అమెరికా వల్లే క్యూబాలో ఈ సంక్షోభం తలెత్తిందని అన్నారు. 

క్యూబాకు చమురు, విద్యుత్ సరఫరా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని అమెరికా బెదిరించడంతో ఏ దేశం తమకు ఇంధనం అమ్మేందుకు ముందకు రావడం లేదని తెలిపారు. ఏ దేశం నుంచైనా ఇంధనం కొనడానికి క్యూబా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వారం 100 మిలియన్ డాలర్ల (74 మిలియన్ పౌండ్ల) విలువైన మానవతా సహాయం కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను క్యూబా తిరస్కరించిందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

►ALSO READ | చైనా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు.

క్యూబా చమురు కోసం ప్రధానంగా వెనిజులా, మెక్సికో దేశాలపై ఆధారపడుతుంది. అయితే, క్యూబాకు ఇంధనాన్ని పంపే దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా తమకు ప్రధాన చమురు సరఫరాదారైన వెనిజులాను అమెరికా ఆక్రమించింది. దీంతో వెనిజులా నుంచి క్యూబాకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ట్రంప్ సుంకాల బెదిరింపుతో మెక్సికో కూడా క్యూబాకు ఆయిల్ సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో క్యూబాలో తీవ్ర ఇంధన, విద్యుత్ సంక్షోభం ఏర్పడింది.