- ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవలే 1,000 రోజుల పాలన పూర్తిచేసుకోగా.. దీనిపై ఉభయ సభల్లో చర్చించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సమావేశాల్లోనే ‘కోర్ అర్బన్ రీజియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (క్యూర్ -2026)’ ముసాయిదా బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు శివార్లలోని మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఏకీకృత పాలన, ఆస్తి పన్నుల విధానంలో సంస్కరణలు, అనధికార నిర్మాణాలపై నిబంధనలు తదితర అంశాలే లక్ష్యంగా ఈ క్యూర్ బిల్లు రూపొందింది. దీంతో పాటు రాష్ట్రంలో నిషేధ భూముల (22ఏ) సమస్యలు, 2023 డిసెంబర్ కంటే ముందు, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చూపిన పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇక చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెంచేందుకు కనీస వయస్సు నిబంధనను తగ్గించడంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.
22ఏ పై వాడివేడి తప్పదా?
ఈ సమావేశాల్లో క్యూర్ బిల్లుతో పాటు 22ఏపై అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో హోరాహోరీ చర్చ జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య ఈ ఇష్యూలో మాటల యుద్ధం నడుస్తున్నది. అసెంబ్లీలో చూసుకుంటాం అని ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటించగా.. తేల్చుకుందాం రండి అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఇక ఏడు దశాబ్దాల నాటి పాత జీహెచ్‌ఎంసీ చట్ట స్థానంలో వస్తున్న ఈ క్యూర్ బిల్లు వల్ల హైదరాబాద్ మహానగర పరిధిలో భూమి విలువ ప్రాతిపదికన ఆస్తి పన్నుల బాదుడు పెరుగుతుందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు, పట్టణ నివాస సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులోని కొన్ని అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు, 1000 రోజుల పాలనలో తాము సాధించిన రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి నియామకాలు, సన్న బియ్యం ఇతర పథకాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచేందుకు అధికార పక్షం తగిన ఆధారాలతో సమాయత్తమవుతోంది.
