లక్ష ఇచ్చి.. ఐదు లక్షలు తీస్కోండంటూ బురిడీ

లక్ష ఇచ్చి.. ఐదు లక్షలు తీస్కోండంటూ బురిడీ
  • ఆఫ్రికన్​ ఫేక్ ​కరెన్సీ ముఠా మాయాజాలం
  • ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు దోపిడీ
  • ఇద్దరి అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో

హైదరాబాద్‌‌, వెలుగు:  ‘‘నల్ల కాగితంపై కెమికల్​పోస్తే.. కరెన్సీ నోట్లు అయితయ్.. కావాలంటే ఈ డెమో చూడండి. వర్జినల్​కరెన్సీ లక్ష ఇవ్వండి.. ఫేక్​కరెన్సీ ఐదు లక్షలు తీస్కోండి” అంటూ నకిలీ నోట్లతో దోపిడీకి పాల్పడుతున్న ఆఫ్రికన్​ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సభ్యుల వెస్ట్‌‌ ఆఫ్రికన్‌‌ గ్యాంగ్​లో మల్కాజిగిరి ఎస్‌‌ఓటీ పోలీసులు మంగళవారం ఇద్దరిని అరెస్ట్‌‌ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను ఎస్‌‌ఓటీ డీసీపీ గిరిధర్‌‌‌‌తో కలిసి రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు బుధవారం వెల్లడించారు.

వాట్సాప్​గ్రూపులో డెమో చూపి..

కామెరూన్‌‌ దేశానికి  చెందిన కొంబి ఫ్రాంక్ సెద్రిక్‌‌(35)గత మూడేండ్లుగా గుర్‌‌‌‌గావ్‌‌లో ఉంటున్నాడు. మరో ఇద్దరు ఆఫ్రికన్స్‌‌ గొయిట సౌంగల(52), రొలాక్స్‌‌(43) బెంగళూరు‌‌లో ఉంటున్నారు. వీరంతా స్టూడెంట్‌‌ వీసాపై ఇండియాకు వచ్చి గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉంటున్నారు. ఈ ముగ్గురు మరో నైజీరియన్​జోసఫ్​తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వెస్ట్​ఆఫ్రికాకు చెందిన డేవిడ్​అనే వ్యక్తి ‘వెరిఫైడ్​క్లోన్​క్రెడిట్​కార్డ్’ పేరుతో వాట్సాప్​గ్రూప్​క్రియేట్​చేశాడు. ఢిల్లీ, ముంబయి, కోల్‌‌కతా, హైదరాబాద్‌‌కు చెందిన వారి నెంబర్లను సేకరించి వీరంతా ఆ వాట్సాప్​గ్రూపులో జాయిన్ చేస్తారు. తమ వద్ద బ్లాక్‌‌ కరెన్సీ ఉందని, నల్ల కాగితాలపై కెమికల్​పోసి క్లీన్‌‌ చేస్తే ఇండియన్​కరెన్సీలో రూ.500 వర్జినల్ నోట్లు తయారవుతాయని డెమో వీడియోలు వాట్సాప్​లో పెట్టేవారు. రూ.లక్ష ఇస్తే రూ.5 లక్షలు విలువ చేసే బ్లాక్‌‌ పేపర్స్‌‌(ఫేక్ కరెన్సీ) ఇస్తామని చెప్పేవారు. ఆ బ్లాక్‌‌ పేపర్స్‌‌ను వర్జినల్‌‌ నోట్స్‌‌గా మార్చుకుని చెలామణి చేసుకోవచ్చని ఆశ చూపేవారు. ఎవరైనా వీరిని సంప్రదిస్తే.. అప్పటికే నల్ల రంగు పూసిన వర్జినల్‌‌ ఇండియన్​కరెన్సీ నోటుపై కెమిక్​ పోసి క్లిన్​ చేసి వర్జినల్​నోట్‌‌ తయారైందని డెమో చేసి చూపేవారు. తాము ఇచ్చే నల్ల కాగితాలపై రహస్యంగా కెమికల్​పోసి క్లీన్ చేసుకోవాలని చెప్పేవారు. వర్జినల్​కరెన్సీ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేవారు. ఎవరికైనా సందేహం వచ్చి అక్కడే టెస్ట్​చేసుకుంటే.. వారిపై మత్తుమందు చల్లి క్యాష్‌‌తో 
పారిపోయేవారు.

రూ.5 లక్షలు కొట్టేసి దొరికారు

బోడుప్పల్‌‌కు చెందిన జొమాటో డెలివరీ బోయ్‌‌ విష్ణువర్ధన్ రెడ్డి నెంబర్ ‘వెరిఫైడ్‌‌ క్లోన్‌‌ క్రెడిట్‌‌ కార్డ్‌‌’ గ్రూప్‌‌లో యాడ్​అయింది. అందులోని డెమో చూసిన విష్ణువర్ధన్‌‌రెడ్డితో నిందితుడు డేవిడ్​చాటింగ్‌‌ చేశాడు. తమ వద్ద బ్లాక్ కరెన్సీ నోట్స్‌‌ ఉన్నాయని 1:5 రేషియో ప్రకారం డీల్ సెట్‌‌ చేశాడు. రోలెక్స్‌‌ అనే వ్యక్తి వచ్చి డెమో ఇస్తాడని చెప్పాడు. డిసెంబర్‌‌‌‌29న మెహిదీపట్నంలో విష్ణువర్ధన్‌‌రెడ్డిని రోలెక్స్‌‌ కలిశాడు. కొన్ని బ్లాక్‌‌ పేపర్‌‌‌‌ను కెమికల్‌‌తో క్లియర్‌‌‌‌ చేసి వర్జినల్ నోట్‌‌గా చూపించాడు. పూర్తిగా నమ్మిన విష్ణువర్ధన్​రెడ్డి ఈ నెల 5వ తేదీన మాదాపూర్‌‌‌‌లోని ఓ హోటల్‌‌లో జోసఫ్‌‌, కొంబి ఫ్రాంక్‌‌ సెద్రిక్‌‌లను కలిసి డీల్ ప్రకారం రూ.5 లక్షలు ఇచ్చి, రూ.25 లక్షలు విలువ అని నమ్మించిన బ్లాక్‌‌ పేపర్స్‌‌(ఫేక్ కరెన్సీ) బండిల్స్‌‌ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చెక్​చేయగా.. అంతా ఫేక్​అని తేలింది. మోసపోయాననని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి కొంబి ఫ్రాంక్‌‌ సెద్రిక్‌‌, గొయిట సౌంగలను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఫేక్​కరెన్సీ బండిల్స్, కెమికల్స్​స్వాధీనం చేసుకున్నారు.